Krishna – Sobhan Babu: తెలుగునాట ఇప్పుడు ‘మల్టీస్టారర్’ అనే మాట విశేషంగా వినిపిస్తున్నా, ఇప్పుడొస్తున్న చిత్రాలేవీ అసలైన మల్టీస్టారర్స్ కావనే సినీప్రియుల అభిప్రాయం. మల్టీస్టారర్స్ కు మహానటుటు యన్టీఆర్- ఏయన్నార్ కాంబినేషన్ పెట్టింది పేరు. వారిద్దరూ కలసి 15 చిత్రాల్లో నటించారు. వారు చూపిన బాటలోనే నడుస్తూ తరువాతి తరంలో పోటాపోటీగా సాగిన కృష్ణ, శోభన్ బాబు కూడా ఓ డజను చిత్రాల్లో కలసి నటించారు. కృష్ణ తన కంటే సీనియర్ స్టార్స్ తోనూ, తన సమకాలికులతోనూ, తరువాతి తరం వారితోనూ కలసి పలు ‘మల్టీస్టారర్స్’లో నటించారు. బహుశా ఇన్ని తరాల స్టార్స్ తో కలసి నటించిన క్రెడిట్ కృష్ణకే దక్కుతుందేమో! అదలా ఉంచితే తెలుగునాట యన్టీఆర్-ఏయన్నార్ తరువాత పోటాపోటీగా సాగిన స్టార్స్ శోభన్ బాబు, కృష్ణ అనే చెప్పాలి. ఆ తరువాతి తరంలో ఎందరు స్టార్స్ బాక్సాఫీస్ బరిలో తలపడ్డా వీరెవరూ కలసి నటించకపోవడం గమనార్హం. అందువల్ల తెలుగువారికి చివరగా అసలు సిసలు మల్టీస్టారర్స్ ను అందించిన ఘనులు కృష్ణ-శోభన్ బాబు అనే చెప్పాలి.
కృష్ణ మాస్… శోభన్ క్లాస్…
కృష్ణ, శోభన్ బాబు నటజీవితాలు భిన్నంగా సాగినా వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ నెలకొని ఉండేది. కృష్ణ తన మూడో చిత్రం ‘గూఢచారి 116’తోనే సోలో హీరోగా మంచి విజయాన్ని మూటకట్టుకున్నారు. అయితే కృష్ణ కన్నా ముందే 1959లో చిత్రసీమలో అడుగు పెట్టిన శోభన్ బాబు స్టార్ డమ్ చేరుకోవడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. కృష్ణకు సోలో హీరోగా పేరు సంపాదించి పెట్టిన ‘గూఢచారి 116’లోనే శోభన్ బాబు ఓ చిన్న పాత్రలో కనిపించారు. తరువాత కృష్ణ,శోభన్ బాబు- హరనాథ్, రామకృష్ణతో కలసి ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’లో నటించారు. అందులోనే “ఓ … ఏమి ఈ వింత మోహం…” పాటలో ఈ నలుగురు హీరోలు కలసి ఎవరి పంథాలో వారు అభినయించారు. తరువాత కృష్ణ, శోభన్ బాబు కలసి “లక్ష్మీ నివాసం (1968), మంచి మిత్రులు (1969), విచిత్ర కుటుంబం (1969), మా మంచి అక్కయ్య (1970), పుట్టినిల్లు-మెట్టినిల్లు (1973), గంగ-మంగ (1973)” చిత్రాల్లో నటించారు. ఈ సినిమాల్లో నటించే సమయానికి వీరిద్దరి మధ్య పెద్దగా పోటీలేదు. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసుకుంటూ పోయేవారు. అయితే శోభన్ బాబుకు గ్లామర్, క్లాసిక్ టచ్ ఉన్న పాత్రలు లభిస్తే, కృష్ణకు కాసింత మాస్ టచ్ రోల్స్ దొరికాయి. నిజజీవితంలోనూ కృష్ణ, శోభన్ బాబు మంచిమిత్రులుగానే మసలుకున్నారు.
అప్పటి నుండే అసలు పోటీ!
1973 నుండి కృష్ణ, శోభన్ బాబు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం మొదలయింది. కృష్ణ నటించిన ‘మల్లమ్మకథ’, శోభన్ బాబు ‘జీవనతరంగాలు’ ఓ వారం గ్యాప్ తో పోటీపడ్డాయి. ఈ రెండు చిత్రాలు ఈ హీరోలిద్దరికన్నా ఆ సినిమాల్లో నటించిన నాయికలకే మంచి పేరు సంపాదించిపెట్టాయి. తరువాత కృష్ణ నటించిన ‘నేరము-శిక్ష’ (1973) విడుదలైన రెండు వారాలకే శోభన్ బాబు ‘మైనర్ బాబు’గా జనం ముందు నిలిచారు. ఈ రెండు చిత్రాల్లో హీరోలిద్దరికీ మంచి పేరు లభించింది. ఆ తరువాత కృష్ణ ‘వింతకథ’తో శోభన్ ‘డాక్టర్ బాబు’, కృష్ణ ‘సత్యానికి సంకెళ్ళు’తో శోభన్ ‘మంచిమనుషులు’ , కృష్ణ ‘చీకటి వెలుగులు’తో శోభన్ ‘బలిపీఠం’ తలపడ్డాయి. దీంతో కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య కూడా మెల్లగా పోటీ పెరగసాగింది. యన్టీఆర్-ఏయన్నార్ శ్రీకృష్ణార్జునులుగా ‘శ్రీకృస్ణార్జునయుద్దం’లో నటించారు. వారిబాటలోనే పయనిస్తూ వచ్చిన శోభన్ బాబు, కృష్ణ ‘కురుక్షేత్రం’లో కృష్ణార్జునులుగా కనపించారు. ఈ ఇద్దరూ కలసి నటించిన ‘కురుక్షేత్రం’ (1977) చిత్రం ఏకంగా యన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’తో తలపడడంతో కృష్ణ, శోభన్ కు కూడా టాప్ స్టార్స్ జాబితాలో చేరిపోయే అవకాశం లభించింది.
వారి తరువాత వీరే!
యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరికీ సమానంగా పాటలు,సమానమైన సన్నివేశాలు ఉండడం ‘రామకృష్ణులు’తోనే మొదలయింది. ఈ సినిమా ప్రదర్శన సమయంలో యన్టీఆర్ పాటలొస్తే ఏయన్నార్ ఫ్యాన్స్ బయటకు పోవడం, ఏయన్నార్ సాంగ్స్ సమయంలో యన్టీఆర్ అభిమానులు లేచిపోవడం చేశారు. అదే పంథాను శోభన్, కృష్ణ అభిమానులు కూడా అనుసరించారు. 1979లో కృష్ణ, శోభన్ హీరోలుగా రూపొందిన ‘మండేగుండెలు’ విడుదల సమయంలో వీరిద్దరి అభిమానులు కూడా ఆ మహానటుల ఫ్యాన్స్ బాటలో నడిచారు. ఈ సినిమాలో కృష్ణ కంటే శోభన్ బాబు కాస్ట్యూమ్స్ బాగున్నాయని, అలాగే ఓ సీన్ లో కృష్ణను శోభన్ చేయిచేసుకోవడం కూడా అభిమానులను బాధించింది. ఎందరో కృష్ణ అభిమానులు ఆయన దగ్గరకు వెళ్లి, మీరు శోభన్ బాబు కంటే అన్నిటిలోనూ ఎక్కువగా ఉండేలా నటించాలని మొరపెట్టుకున్నారు. కృష్ణ తన సహజధోరణిలో చిరునవ్వులు చిందిస్తూ ‘అదంతా నటనే కదా. రియల్ లైఫ్ లో మేమిద్దరం మంచి మిత్రులం’ అని చెప్పినా ఫ్యాన్స్ తృప్తి చెందలేదు. దాంతో కృష్ణ అభిమానులు “మీ హీరోకు డైరెక్టు జూబ్లీ లేదంటూ” శోభన్ బాబు ఫ్యాన్స్ ను ఎగతాళి చేయడం, “మీ హీరోకు మా అంత సక్సెస్ రేట్ లేదని ” కృష్ణ ఫ్యాన్స్ ను శోభన్ బాబు అభిమానులు ఎద్దేవా చేయడం మొదలయింది. ఒకరి రికార్డులను ఒకరు ఆకాశానికి ఎత్తుకుంటూ పోటాపోటీగా కరపత్రాల యుద్ధం చేసిన సందర్భాలూ ఉన్నాయి.
‘ముందడుగు’తో భలే రికార్డ్!
కృష్ణ కు మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంటే, శోభన్ బాబుకు మహిళా ప్రేక్షకుల్లో విశేషాదరణ లభిస్తూండేది. దాదాపు ముప్సైసార్లు కృష్ణ, శోభన్ బాబు చిత్రాలు పోటీ పడి ఉంటాయి. కొన్నిసార్లు కృష్ణ సినిమాలది పైచేయి అయితే, మరికొన్ని సార్లు శోభన్ చిత్రాలు ఆధిక్యం ప్రదర్శించేవి. ఇలా సాగుతున్న సమయంలో వీరిద్దరితో సినిమాలు తీయాలన్నా నిర్మాతలు జంకేవారు. ముందు ఏ హీరోను పలకరిస్తే, ఏ హీరోకు కోపం వస్తుందోనని నిర్మాతలు జడుసుకొనేవారు. అయితే కృష్ణ మాత్రం తనకంటే సీనియర్ అయిన శోభన్ బాబుకు ఎంతో విలువనిచ్చేవారు. అందుకే సినిమాల్లో శోభన్ పాత్రలు పైచేయిగా సాగినా, కృష్ణ చిరునవ్వుతో సర్దుకు పోయేవారు. వీరిద్దరితో దాసరి తెరకెక్కించిన ‘కృష్ణార్జునులు’ (1982) సమయంలో వీరి ఫ్యాన్స్ మధ్య మరింత పోటీ నెలకొంది. ఆ తరువాత శోభన్, కృష్ణతో కె.బాపయ్య దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ‘ముందడుగు’ (1983) తెలుగునాట ఓ చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఏ మల్టీస్టారర్ సాధించని అరుదైన విజయాన్ని ‘ముందడుగు’ సొంతం చేసుకుంది. తెలుగు మల్టీస్టారర్స్ లో గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న ఏకైక చిత్రంగా ‘ముందడుగు’ నిలచింది. ఈ సినిమా సమయంలోనూ, తరువాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, శోభన్ నటించిన ‘ఇద్దరుదొంగలు’ సమయంలోనూ వీరి అభిమానుల మధ్య వైరం మిన్నంటింది. 1985లో ఈ ఇద్దరు హీరోలతో కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ‘మహాసంగ్రామం’తో కృష్ణ-శోభన్ మల్టీస్టారర్ పయనానికి ఫుల్ స్టాప్ పడింది. ఆ చిత్రంలో శోభన్ పాత్రకన్నా కృష్ణ పాత్రకు ఎంతో ప్రాధాన్యముండడంతో అలా వారి జంటప్రయాణం ముగిసింది. ఏది ఏమైనా తెలుగువారికి చివరగా అసలు సిసలు మల్టీస్టారర్స్ ను చూపిన ఘనత కృష్ణ-శోభన్ బాబు జోడీదే. ఏది ఏమైనా తెలుగునాట యన్టీఆర్-ఏయన్నార్ అన్న పేర్ల తరువాత చప్పున జనానికి గుర్తుకు వచ్చే పేర్లు కృష్ణ-శోభన్ బాబువే. మళ్ళీ ఆ స్థాయిలో జోడీకట్టిన పేర్లేవి లేవనే చెప్పాలి.