తెలుగు ఇండియన్ ఐడిల్ మరో స్థాయికి చేరుకుంది. ఈ వీకెండ్ నుండి కంటెస్టెంట్స్ కు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ తో పాటు వీక్షకులు వేసే ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారు. మొత్తం పన్నెండు మందిలో ఎపిసోడ్ 9లో ఆరుగురు పాటలు పాడి తమ ప్రతిభను చాటారు. దాదాపు గంట నిడివి ఉన్న ఈ ఎపిసోడ్ లో మొదటి ఎనిమిది నిమిషాలు అందరూ వచ్చి కూర్చోవడం, శ్రీరామచంద్రను తమన్ తనదైన శైలిలో ఆటాడుకోవడంతో సాగిపోయింది. ‘అమ్మాయిలకు షేక్ హ్యాండ్ ఇచ్చే శ్రీరామ్… అబ్బాయిలకు మాత్రం హ్యాండ్ ఇస్తాడం’టూ తమన్ సరదాగా కామెంట్ చేశాడు. ఇంతవరకూ షోలో పాల్గొనడానికి పాడిన కంటెస్టెంట్స్… ఇకపై గెలవడం కోసం పాడాలంటూ తమన్ హితవు పలికారు.
Read Also : Beast : రాఖీ భాయ్ తో ఢీకి రెడీ… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ్
ఈ ఎపిసోడ్ లో మొదటగా వచ్చిన రేణు కుమార్ శుక్రవారం విడుదలైన ‘ట్రిపుల్ ఆర్’ మూవీలోని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ పాట పాడాడు. 98 పర్శంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావంటూ కార్తీక్ రేణు కుమార్ ను అభినందించాడు. అంతేకాదు… ఆ పాట తనతో సీటీమార్ వేయిస్తోందంటూ విజిల్ వేశాడు. మరో విశేషం ఏమంటే… ఈ వీకెండ్ ఎపిసోడ్స్ ను ‘సూపర్ హీర్ స్పెషల్’గా శ్రీరామచంద్ర పేర్కొన్నాడు. కంటెస్టెంట్స్ ను వారి జీవితంలో సూపర్ హీరో ఎవరో అడిగి తెలుసుకున్నాడు. అలా రేణును అడిగినప్పుడు తన స్నేహితులే సూపర్ హీరోస్ అని చెప్పాడు. ఇటీవల చనిపోయిన పండు అనే స్నేహితుడిని తలుచుకుని రేణు కన్నీళ్ళు పెట్టుకోగానే కార్తీక్ వచ్చి హగ్ చేసుకుని ఓదార్చాడు. ఆ తర్వాత వచ్చిన వైష్ణవి ‘పుష్ప’ సినిమాలోని ‘నువ్ అమ్మీ అమ్మీ అంటావుంటే’ సాంగ్ ను అద్భుతంగా పాడి అందరినీ ఆకట్టుకుంది. ఆమె పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన జడ్జీలు ‘బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అంటూ కితాబిచ్చారు. అదే పాటను ఆ తర్వాత కార్తీక్ లేడీ కంటెస్టెంట్స్ ఏడుగురితో పాడించాడు. వారితో నిత్యామీనన్ కూడా గొంతు కలిపింది. ఇదే సందర్భంలో తమన్ డీఎస్పీని ఆకాశానికి ఎత్తేశాడు. బేసికల్ గా రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవీశ్రీ ప్రసాద్ లో మంచి కొరియోగ్రాఫర్ కూడా ఉన్నాడని, అందువల్ల పాటను ఎక్కడ ఎత్తాలో ఎక్కడ తగ్గించాలో అతనికి తెలుసనీ, అదే ‘డీఎస్పీ యూఎస్ పీ’ అని చెప్పాడు. వైష్ణవి తన సూపర్ హీరో తల్లి అని, అలానే ఆమె తర్వాత తన మావయ్యలు పార్థసారథి, కళ్యాణ్ అని చెప్పింది. ఇక ‘బిర్యానీ’ జయంత్ ‘పేట’లోని ‘రచ్చాడు కోక….’ పాట పాడాడు. ఆ తర్వాత వచ్చిన అదితి భావరాజు ‘వర్షం’ సినిమాలోని ‘ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా…’ పాటను పాడింది. దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ లో లాండ్ మార్క్ గా నిలిచిన ఈ సినిమాకు తాను మ్యూజిక్ కండెక్టర్ గా ఉన్నానంటూ ఆ రోజుల్ని తమన్ తలుచుకున్నాడు. తన తండ్రి తన సూపర్ హీరో అని అదితి చెప్పగానే ఆయన్ని స్టేజ్ మీదకు ఇన్వైట్ చేశారు.
బీవీకే వాగ్దేవి ‘కృష్ణం వందే జగద్గురుం’లోని ‘సయంద్రి నాను సయ్యంద్రిరా’ పాటను వీనుల విందుగా పాడి జడ్జీల మనసు దోచుకుంది. తన సూపర్ హీరో తల్లి అని వాగ్దేవి చెప్పడంతో ఆమెను, అక్క వైష్ణవిని నిర్వాహకులు స్టేజ్ మీదకు ఆహ్వానించారు. మరోసారి వైష్ణవి వేదిక మీదకు రావడం ఆనందంగా ఉందని శ్రీరామచంద్ర చెప్పాడు. అతని తరహాలోనే తన తల్లి మీద కూడా ఓ కవిత రాసి, చదివింది వాగ్దేవి. ఈ పాటను మణిశర్మ అద్భుతంగా కంపోజ్ చేశారని అన్నాడు తమన్. ఇక ఈ ఎపిసోడ్ లో చివరి పెర్ఫార్మెన్స్ మారుతి ఇచ్చాడు. ‘సఖి’ సినిమాలోని ‘అలలే… చిట్టి అలలే’ గీతాన్ని అతను పాడాడు. ఎస్పీ చరణ్ వచ్చి పాట పాడినట్టుగా ఉందంటూ తమన్ కితాబిచ్చాడు. తనకు సూపర్ హీరో అంటే ‘తెలుగు ఇండియన్ ఐడిలే’ అని మారుతి చెప్పడం విశేషం. ప్రతి ఒక్కరూ పాట పాడిన తర్వాత… తమ పెర్ఫార్మెన్స్ నచ్చితే ఓటు వేయమంటూ విజ్ఞప్తి చేశారు. ఇక శనివారం మిగిలిన ఆరుగురి పెర్ఫార్మెన్స్ చూడాల్సి ఉంది. సో… ఈ పన్నెండు మందిలో ఎవరు తర్వాతి రౌండ్స్ కు చేరతారనేది ప్రస్తుతానికి సస్పెన్సే!
