తెలుగు ఇండియన్ ఐడల్ నిర్వాహకులు సెమీ ఫైనల్స్ టెలీకాస్ట్ ను పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ముందే అయిపోయినా… గత రెండు వారాలుగా వీకెండ్ లో కేవలం శుక్రవారం మాత్రమే ఈ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నారు. లాస్ట్ ఫ్రై డే ఉషా ఉతప్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. అది ఓటింగ్ ఎపిసోడ్ కాగా, ఈ శుక్రవారం సెమీ ఫైనల్స్ కు బాలకృష్ణ గెస్ట్ గా వచ్చారు. అంతేకాదు… ఇది ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా!
‘అన్ స్టాపబుట్ టాప్ 6’ పేరుతో జరిగిన సెమీ ఫైనల్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ‘జై బాలయ్య… ‘ సాంగ్ తో ఆయనకు స్వాగతం పలికారు. తన తండ్రి ఎన్టీయార్ గురించి, ఆయన శతజయంతి ప్రారంభ సంవత్సరం ఇదంటూ బాలకృష్ణ కొద్దిసేపు మాట్లాడారు. ‘నేను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కంటెస్టెంట్ గానే వచ్చాను అని బాలకృష్ణ సరదాకు అన్నప్పటికీ, ఆరుగురు ఫైనలిస్టులకు బాలకృష్ణ జడ్జిగానే వ్యవహరించారు. ఆయన సలహాలూ సూచనలతోనే మిగిలిన వారు మార్కులు వేశారు. బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా తన చేతుల్లోనే ఉందని బాలకృష్ణ చెప్పారు.

మొదటగా పాడటానికి వచ్చిన శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘అఖండ’ మూవీలోని ‘భం అఖండ’ పాటను అద్భుతంగా పాడాడు. అతనికి కోరస్ తో చక్కని సహకారం అందించారు మిగిలిన కంటెస్టెంట్స్. ఈ సినిమాకు పాటల్ని తాను బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని కాకుండా దేవుడిని దృష్టిలో పెట్టుకుని చేశానని తమన్ చెప్పారు. బాలకృష్ణ త్రిశూలం పట్టుకుని వచ్చే సీన్ ను తెర మీద ఊహించుకుని, దానికి తగ్గట్టుగా హైలెవల్ లో ఉండటం కోసం వంద మందికి పైగా సింగర్స్ తో కోరస్ పాడించానని అన్నారు. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న శ్రీనివాస్ ను కాసేపు బాలకృష్ణ ఆట పట్టించారు. ‘ఎప్పుడు పెళ్ళి?’ అని కాకుండా, ‘ఎందుకు పెళ్ళి?’ అని అడగదలుచుకున్నానని, బట్ పెళ్ళి నిర్ణయం తీసుకున్నావు కాబట్టి భార్యను అదుపులో పెట్టుకోవడం ఎలా అనే టిప్స్ ను చెబుతానంటూ ఓ పుస్తకం కానుకగా ఇచ్చారు. సెకండ్ కంటెస్టెంట్ లాలస ‘భైరవ ద్వీపం’లోని ‘నరుడా ఓ నరుడా… ‘ గీతాన్ని ఆలపించింది. ఈ సినిమా పాటల రికార్డింగ్ అప్పుడు తమన్ చిన్న పిల్లవాడని, బంగిన పల్లి మామిడి పండులా ఉండేవాడని అన్నారు. తనకు వాద్యకారుడిగా అదే మొదటి సినిమా అని, తన తండ్రి మ్యూజిక్ కండక్టర్ గా ఉండేవారని తమన్ చెప్పాడు. గాయని లాలసను కూడా బాలకృష్ణ ఆట పట్టించారు. పాట పాడేప్పుడు ఆమె చేతిని చిత్రంగా ఊపుతుందని గమనించిన బాలకృష్ణ ఆమె చేతికి ఓ బ్రెష్ ఇస్తే మంచి పెయింటింగ్ అయిపోతుందని అన్నారు. ఆమెకు బ్రెష్, పెయింటింగ్ బాటిల్స్ గిఫ్ట్ గా ఇచ్చారు.

మూడో కంటెస్టెంట్ మాస్ జయంత్ ‘నరసింహ నాయుడు’ మూవీ నుండి ‘లక్స్ పాప లక్స్ పాప లంచికొస్తావా?’ పాటను పాడాడు. పాట పాడిన విధానాన్ని మెచ్చుకున్న బాలకృష్ణ జయంత్ చేతిరేఖలను చూసి కష్టపడితే మాస్ హీరో అవుతావంటూ ఆశీర్వదించారు. నీళ్ళు ఎక్కువగా తాగే జయంత్ ను ‘నువ్వు జయంత్ కాదు జలంత్’ అంటూ నవ్వించారు బాలకృష్ణ. ఆ తర్వాత వచ్చిన ప్రణతి ‘సమరసింహారెడ్డి’లోని ‘అందాల ఆడబొమ్మ’ పాటను పాడింది. ఆ పాటకు ఫిదా అయిన బాలకృష్ణ ఆమెకు ‘భాస్కర్ అవార్డ్’ను అందించారు. ఉదిత్ నారాయణ్ తనకు మొదటిసారి ఆ సినిమాలో పాట పాడరని, అంజలా ఝవేరీ, తాను కలిసి నటించిన ఈ పాటను థియేటర్ లో జనాలు చాలా సైలెంట్ గా చూశారని, పాట పూర్తి కాగానే హర్షాతిరేకంగా చప్పట్లు కొట్టారని, సీతారామశాస్త్రి చాలా అర్థవంతంగా ఆ పాట రాశారని అన్నారు. సింగర్ వాగ్దేవి ‘ఆదిత్య 369’ మూవీ నుండి ‘రాసలీల వేళ.. రాయబారమేలా…’ గీతాన్ని ఆలపించింది. వాగ్దేవిని బాలకృష్ణ సైతం వావ్ దేవిగానే సంభోదించారు. అంతేకాదు… ఆమెలో పూజా హెగ్డే ఛాయలున్నాయంటూ మెచ్చుకున్నారు. అందరినీ అడిగినట్టుగానే వాగ్దేవి బాలకృష్ణకూ ఓ పొడుపు కథ వేసింది. ఆయన ఠక్కున దానికి సమాధానం చెప్పి, రివర్స్ లో వాగ్దేవికీ ఓ పొడుపు కథ వేశారు. కానీ ఆమె సమాధానం చెప్పలేకపోయింది. చివరగా వచ్చిన వైష్ణవి ‘సమరసింహారెడ్డి’లోని ‘నందమూరి నాయక…’ పాటను పాడింది. ఆమె పాడిన విధానానికి ముగ్ధుడైన బాలకృష్ణ స్టేజ్ మీదకు వెళ్ళి వైష్ణవితో కలిసి డాన్స్ చేశారు. బాలకృష్ణ పుట్టిన రోజునే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుండటంతో… ఇదే వేదికపై ఆయన బర్త్ డే వేడుకలను నిర్వహించారు.
ఎలిమినేట్ అయిన లాలస!
అన్ స్టాపబుల్ టాప్ 6 కంటెస్టెంట్స్ నుండి సెమీ ఫైనల్స్ లో లాలస ఎలిమినేట్ అయ్యింది. అయితే ఇది ప్రారంభం మాత్రమేనని ఆమెకు గొప్ప ఫ్యూచర్ ఉందని తమన్, నిత్యామీనన్, కార్తీక్ చెప్పారు. సో… వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరవుతున్నారు. దానికి సంబంధించిన వీడియోనూ ఎపిసోడ్ చివరిలో ప్లే చేశారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ప్రారంభం నుండి చివరకూ కంటెస్టెంట్స్, జడ్జెస్, ఆడియెన్స్ అంతా జై బాలయ్య అంటూ నినదిస్తూ అందరిలో జోష్ నింపారు.