ఇండియన్ ఐడిల్ కార్యక్రమంలో పాల్గొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగానే గాయనీ గాయకులు పోటీ పడినట్టు ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే మార్చి 4, 5 తేదీలలో స్ట్రీమింగ్ అయిన 3వ ఎపిసోడ్ చూస్తే… కామెడీ ఎక్కువ కంటెంట్ తక్కువ అనే భావనే వీక్షకులకు కలిగింది. ఆహా నుండి వస్తున్న ఈ కార్యక్రమంలో గానం కంటే వినోదానికి పెద్ద పీట వేస్తున్నారేమో అనిపిస్తోంది. పైగా కంటెస్టెంట్స్ అందిస్తున్న వినోదం, మిఠాయిలు… న్యాయనిర్ణేతలను శాటిస్ ఫై చేస్తుండొచ్చు కానీ వీక్షకులను కాదు.
శుక్రవారం ప్రసారమైన మూడో ఎపిసోడ్ తొలి రోజున గాయని అదితి భావరాజు స్టేజ్ మీదకు రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తమన్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే ఆరేడు పాటలు పాడిన అదితి ‘నా వాయిస్ చాలా మందికి తెలుసు, నేనెవరో తెలియడం కోసం ఈ షోకి వచ్చాను’ అని చెప్పడం బాగానే ఉంది. కానీ ఇప్పటికే ఓ స్థాయికి చేరుకున్న ఆ సింగర్ స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇస్తే బాగుండేది. అలానే లాస్ట్ ఎపిసోడ్ లోనూ శ్రీరామచంద్ర కజిన్ కు నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. దాంతో అయినవాళ్ళకు అనుకూలంగా ఎంపిక జరుగుతోందనే విమర్శలు వచ్చే ఆస్కారం ఉంది. ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సినిమాలో తానే పాడిన పాటను స్టేజ్ మీద కూడా పాడి అదితి న్యాయనిర్ణేతల మనసు దోచుకుంది ఆమెకు మొదట గోల్డెన్ టిక్కెట్ ఇచ్చి దానిని వాపస్ తీసుకుని గోల్డెన్ మైక్ అందచేశారు.
ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి పంజాబ్ నుండి వచ్చిన జస్కరణ్ సింగ్ అల్లు అర్జున్ వీరాభిమాని. ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవర గమన’ పాట పాడి ఆకట్టుకున్నాడు. దాంతో తమన్ అతనికి ప్రేమగా ‘సిద్ శ్రీరామ్ ఆఫ్ పంజాబ్’ అనే బిరుదు ఇచ్చేశాడు. ఆ తర్వాత తొమ్మిదో తరగతికి చెందిన మాలోత్ కవిత ఓ చక్కని పాట పాడింది. విజయవాడ నుండి వచ్చిన చంద్రకిషన్ కాసేపు కామెడీగా పాట పాడి వినోదాన్ని పండించానని భ్రమ పడ్డాడు. ఆ తర్వాత తెనాలికి చెందిన హర్షవర్థన్ పాటకు గోల్డెన్ టిక్కెట్ దక్కింది. ఇదే రోజున చిట్టా లక్ష్మీ శ్రావణికి, రేణు కుమార్ కు గోల్డెన్ టిక్కెట్స్ లభించాయి.
శనివారం ఎపిసోడ్ లోనూ పలువురు ప్రతిభావంతులైన గాయనీ గాయకులు గోల్డెన్ టిక్కెట్, గోల్డెన్ మైక్ ను పొందారు. మహబూబ్ నగర్ కు చెందిన డెంటిస్ట్ నాగ సాయి సిందూర ‘రేగూ పూలోలే…’ పాటతో ఆకట్టుకుని గోల్డెన్ టిక్కెట్ పొందగా, కడపకు చెందిన ధర్మశెట్టి శ్రీనివాస్ తన గాత్ర మాధుర్యంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడు. అతనికి మొదట గోల్డెన్ టిక్కెట్ ఇచ్చిన జడ్జెస్… ఆ తర్వాత గోల్డెన్ మైక్ ఇచ్చారు. ఇక జగదీశ్ అనే సింగర్ కమ్ ఆర్టిస్ట్ ‘పుష్ప’లో అల్లు అర్జున్ గెటప్ లో స్టేజ్ మీదకు కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అదే సినిమాలోని ఓ పాటను పాడటమే కాదు… అభినయయించాడు కూడా. ‘దయచేసి… సింగర్ గా మాత్రం మారే ప్రయత్నం చేయకూ’ అంటూ తమన్ అతన్ని హెచ్చరించి పంపేశాడు.
ఆ తర్వాత పాటపాడిన సంహిత గోల్డెన్ టిక్కెట్ అందుకుంది. ఇక ఈ ఎపిసోడ్ లో హైలైట్ గా నిలించింది బ్లైండ్ గర్ల్ మౌనిక. హైదరాబాద్ కు చెందిన మౌనిక కన్నుమూసే లోగా ఒక్క సినిమాకైనా పాట పాడాలన్నది తన కోరికగా తెలిపింది. ఆమె గాత్రానికి మురిసిన న్యాయనిర్ణేతలు గోల్డెన్ టిక్కెట్ ఇచ్చి ఆశీర్వదించారు. శనివారం చివరగా బేబీ సింగర్ గా ‘ప్రయాణం’ చిత్రంలో పాటపాడిన అమృతవర్షిణి… ఇప్పుడు కుమారిగా ఈ షోలో పాల్గొంది. ఆమెకూ జడ్జీలు గోల్డెన్ టిక్కెట్ ఇచ్చారు.
మొత్తంగా చూసుకుంటే… ఆడిషన్ రౌండ్స్ ఏమంత ఆసక్తిని కలిగించలేదు. ఉత్సుకతను రేపలేదు. మరి రాబోయే ఎపిసోడ్స్ లో అయినా… వినోదానికి కాకుండా గాత్రానికి ప్రాధాన్యమిస్తే బాగుంటుంది.