Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!

Johnny Master Wife Sumalatha

Johnny Master Wife Sumalatha

తెలుగు సినీ పరిశ్రమలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ‘తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్’లో రగులుతున్న వివాదాలపై ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతకు ఊహించని భారీ షాక్ ఇస్తూ, ఆమె నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని ఫెడరేషన్ తక్షణమే రద్దు చేసింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరును పరిష్కరించే దిశగా ఫిల్మ్ ఫెడరేషన్ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఫెడరేషన్ పెద్దల ఆధ్వర్యంలో అధ్యక్షురాలు సుమలత, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మరియు యూనియన్ సభ్యులతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు అసోసియేషన్ కు చెందిన మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు.

ఈ సమావేశంలో డ్యాన్సర్ల మద్దతు ఎవరికి ఉందనే విషయంపై జరిగిన బలనిరూపణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా అధికారంలో ఉన్న సుమలతకు కేవలం 11 మంది డ్యాన్సర్లు మాత్రమే మద్దతు తెలపడం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మరోవైపు, రఘు మాస్టర్‌కు ఏకంగా 214 మంది డ్యాన్సర్లు పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. ఈ భారీ మెజారిటీని బట్టి చూస్తే, డ్యాన్సర్లంతా రఘు మాస్టర్ నాయకత్వాన్నే బలంగా కోరుకుంటున్నారని స్పష్టమైంది. సభ్యుల మద్దతు లేకపోవడం, మెజారిటీ డ్యాన్సర్లు రఘు మాస్టర్ పక్షాన నిలబడటంతో.. ఫిల్మ్ ఫెడరేషన్ వెంటనే స్పందించి సుమలత ప్యానెల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయంతో పాటు, అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ వెల్లడించింది. సభ్యుల మద్దతు ఏకపక్షంగా రఘు మాస్టర్ వైపు ఉండటంతో, రాబోయే ఎన్నికల్లో ఆయన ప్యానెల్ గెలవడం దాదాపు ఖాయమనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.