తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల రెంట్/పర్సెంటేజ్ విషయంలో మరోసారి వివాదం రాజుకుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల ప్రతిపాదించిన ‘పర్సంటేజ్ బేస్డ్ స్క్రీనింగ్’ విధానాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని ప్రముఖ నిర్మాతల మండలి అయిన ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ తెగేసి చెప్పింది. ఈ మేరకు గిల్డ్ సభ్యులు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. మార్చి 25, ఏప్రిల్ 2వ తేదీల్లో TFCC జారీ చేసిన సర్క్యులర్లపై నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్సంటేజ్ పద్ధతిని అమలు చేయాలన్న నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నదని, ఇందులో నిర్మాతల అభిప్రాయాలకు తావులేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి అమల్లో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read :Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్బమ్స్ గ్యారెంటీ..
నిర్మాతల ప్రధాన డిమాండ్లు:
ప్రస్తుతం ఏ పద్ధతిలో అయితే సినిమాలు థియేటర్లలో ప్రదర్శితమవుతున్నాయో, దానికే తాము కట్టుబడి ఉన్నామని నిర్మాతలు స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపి, తమకు అనుకూలమైన నిబంధనలతోనే సినిమాలను విడుదల చేస్తామని, ఛాంబర్ రుద్దే నిర్ణయాలను పాటించబోమని పేర్కొన్నారు. TFCC నిర్ణయించిన కొత్త మోడల్లో నడిచే థియేటర్లకు తమ సినిమాలను ఇచ్చే ప్రసక్తే లేదని నిర్మాతలు తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిల్డ్లోని దాదాపు అందరి అగ్ర నిర్మాతలు సంతకాలు చేశారు. వారిలో రవిశంకర్ యలమంచిలి (మైత్రీ మూవీ మేకర్స్), సుధాకర్ చెరుకూరి (SLV సినిమాస్), టి.జి. విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్), సుప్రియ యార్లగడ్డ (అన్నపూర్ణ స్టూడియోస్), నాని ఘంటా (వాల్ పోస్టర్ సినిమా), బన్నీ వాసు, ఎస్.కె.ఎన్, ధీరజ్ మొగిలినేని వంటి మరికొందరు ఉన్నారు. పర్సంటేజ్ విధానంపై నిర్మాతలు కఠినంగా వ్యవహరిస్తుండటంతో, ఛాంబర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.