Telangana Narcotics Control Bureau Issues A Notice To Gaanja Shankar Movie Team: సాయి ధరంతేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ హై పేరుతో ఒక చిన్న గ్లింప్స్ లాంటి వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఇదంతా జరిగి చాలా కాలమే అయింది. మరి ఇప్పుడు ఎందుకు దీని మీద నార్కోటిక్స్ బ్యూరో అధికారుల దృష్టి పడిందో తెలియదు కానీ ఈ టైటిల్ సరిగా లేదంటూ దర్శక నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ ఒక లేఖ రిలీజ్ చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ఈ మేరకు ఒక లేఖ రిలీజ్ చేశారు. సినిమాలో గంజాయి అనే పదాన్ని తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాదు సినిమా తెరకెక్కిన తర్వాత మాదక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ 1985 యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సినిమాలో గంజాయి మొక్కలను చూపించడంతో పాటు గంజాయి వాడకాన్ని ప్రోత్సహించే విధంగా సీన్స్ ఉన్నట్లు రిలీజ్ చేసిన వీడియో ద్వారా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. టైటిల్ విద్యార్థులు సహా యువత మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి టైటిల్ కూడా మార్చాలని కోరారు. మాదకద్రవ్యాల వాడకం సర్వసాధారణం అని సందేశం ఇచ్చేలా ఉన్న సినిమాలోని సీన్స్ తొలగించాలని అసలు గంజాయి అనే పదం లేకుండా డైలాగులు రాసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. నిజానికి బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని గత కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో పోలీసుల నుంచి నోటీసులు అందడంతో సినిమా యూనిట్ ఎలా స్పందించనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత రిలీజ్ అవ్వాల్సిన సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఉన్నాయి.