Tarun Bhaskar:చిత్రసీమ అంటేనే చిత్రవిచిత్రాలకు నెలవు! కొందరు తక్కువ సినిమాలు తీసినా, మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటారు. మరికొందరు ఎన్ని చిత్రాలు చేసినా, జనాల్లో గుర్తింపు పొందలేరు. నటదర్శకరచయిత తరుణ్ భాస్కర్ నిస్సందేహంగా మొదటి కోవకు చెందుతారు. ఆయన నిర్దేశకత్వంలో రూపొందిన చిత్రాలు మూడంటే మూడు. కానీ, నవతరం ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఆయన రచన సైతం జనాన్ని ఆకట్టుకుంది. తాజాగా ‘కీడా కోలా’ అనే చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు తరుణ్ భాస్కర్.
తరుణ్ భాస్కర్ దాస్యం 1988 నవంబర్ 5న మద్రాసులో జన్మించారు. తరువాత తరుణ్ చదువుసంధ్యలన్నీ హైదరాబాద్ లోనే సాగాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనూ, వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనూ తరుణ్ చదువుకున్నారు. ఆ పై ‘న్యూ యార్క్ ఫిలిమ్ అకాడమీ’లో సినిమా మేకింగ్ లో పట్టాపొందారు. తరువాత సొంతగా ‘పెళ్ళిచూపులు’ కథ తయారు చేసుకొని ప్రయత్నాలు మొదలెట్టారు. రాజ్ కందుకూరి, యశ్ రంగినేనికి తరుణ్ కథ నచ్చింది. తత్ఫలితంగా ‘పెళ్ళిచూపులు’ సినిమాగా జనం ముందు నిలచింది. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకు హీరోగా గుర్తింపు లభించడం విశేషం! మొదటి సినిమాతోనే దర్శకునిగా మంచి గుర్తింపు సంపాదించిన తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే పరుగెత్తి పాలు తాగడం కంటే నిల్చుని నీళ్ళు సేవించడమే మేలని భావించిన తరుణ్ ఆచి తూచి అడుగులు వేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేశ్ బాబు కూడా తరుణ్ కు అవకాశం కల్పించారు. సురేశ్ బాబు కోసం ‘ఈ నగరానికి ఏమయింది?’ చిత్రం రూపొందించారు తరుణ్. ఈ సినిమా కూడా యువతను ఆకట్టుకుంది.
తరుణ్ లో రచయిత, దర్శకుడే కాకుండా నటుడు కూడా ఉన్నాడని గుర్తించింది ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్. ‘మహానటి’ చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు పాత్రలో తరుణ్ కనిపించారు. ఆ తరువాత ‘సమ్మోహనం’, ‘ఫలక్ నుమా దాస్’ వంటి చిత్రాల్లోనూ తరుణ్ తెరపై తళుక్కుమన్నారు. మిత్రుడు షమ్మీర్ సుల్తాన్ రూపొందించిన ‘మీకు మాత్రమే చెప్తా’లో కీలక పాత్ర పోషిస్తూనే, సంభాషణలు పలికించారు తరుణ్. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘పిట్టకథలు’ చిత్రంలో ‘రాముల’ సెగ్మెంట్ కు దర్శకత్వం వహించారు తరుణ్ భాస్కర్. తరువాత “మిడిల్ క్లాస్ మెలోడీస్, స్కైలాబ్, సీతారామమ్” సినిమాల్లో నటునిగా కనిపించారు. “ఒకే ఒక జీవితం, ఓరి… దేవుడా” సినిమాలకు రచన చేశారు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం తరుణ్ దృష్టి తన కొత్త సినిమా ‘కీడా కోలా’పైనే ఉంది. ‘కీడా’ అంటే కీటకం, కోలా అంటే కోల్డ్ డ్రింక్. ఈ వరైటీ టైటిల్ తోనే కొంతమంది సినీఫ్యాన్స్ ను ఆకర్షించగలిగారు తరుణ్ భాస్కర్. మరి ఈ చిత్రంతో డైరెక్టర్ గా మళ్ళీ మునుపటి సక్సెస్ ను తరుణ్ భాస్కర్ సొంతం చేసుకుంటారేమో చూడాలి.