‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీయార్, రామ్ చరణ్, రాజమౌళిని దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో బయటపడ్డాయి. తారక్ భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చి 26 కాగా, రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27. దాంతో చాలా సంవత్సరాల పాటు ప్రణతి బర్త్ డే పూర్తి కాగానే, రాత్రికి రాత్రి చరణ్ కారులో తాను బయటకు వెళ్ళిపోయేవాడినని తారక్ చెప్పాడు. తన భార్య ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగితే, నీ పుట్టినరోజు హడావుడీ అయిపోయింది కదా… చెర్రీతో బయటకు వచ్చానని చెప్పేవాడినని అన్నాడు. అలా ఎన్నో పుట్టిన రోజులు రామ్ చరణ్ తో గడిపానని తెలిపాడు.
Read Also : RRR: ఇంతకూ ఎన్టీయార్ కు హీరోయిన్ ఉన్నట్టా లేనట్టా!?
విశేషం ఏమంటే… స్టార్ హీరోలు నిజం చెప్పరని తెలిసికూడా వాళ్ళ రెమ్యూనరేషన్ గురించి అనిల్ రావిపూడి ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. ‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ డేట్స్ ఇప్పటికీ అధికారికం ఎన్ని సార్లు ప్రకటించారన్నప్రశ్నకు రామ్ చరణ్ జవాబు చెప్పలేకపోయాడు. ఎన్టీయార్ దాదాపుగా కరెక్ట్ గా చెప్పాడు. అదే సమయంలో రామ్ చరణ్ ను ‘ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఎంత?’ అని అడిగాడు అనిల్ రావిపూడి. ఈ ప్రశ్నకు కూడా తారక్ జవాబు చెబుతాడని, దానిని పాస్ చేశాడు. దానికి తారక్ నవ్వుతూ, ‘నీకు ఎంత కావాలో అడుగు, నాకూ అంతే ఫిక్స్ చేయి అని చెర్రీ తనతో అన్నాడ’ని బదులిచ్చాడు. ‘వాళ్ళ మధ్య మంచి స్నేహం ఉండటంతో రెమ్యూనరేషన్ విషయంలోనూ ఇద్దరూ కలిసి గేమ్ అడినట్టుగా ఉంద’ని రాజమౌళి అన్నాడు. అయితే… ‘ట్రిపుల్ ఆర్’కు తారక్, చెర్రీ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి చాలా సందర్భాలలో చాలానే చర్చ జరిగింది. మొన్న భువన్ చేసిన ఇంటర్వ్యూలో కూడా ‘మీరు ఒక్కొక్కరూ ఈ మూవీకి వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది?’ అని అన్నాడు. దానికి వారు సమాధానం చెప్పకుండా దాటేశారు. అయితే… రాజమౌళి మాత్రం పారితోషికాల విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాడు. ‘ట్రిపుల్ ఆర్’ ప్రాజెక్ట్ అంగీకరించడం అంటే ఇట్ సెల్ఫ్ శాక్రిఫైజేషన్ అని చెప్పాడు. ‘మా హీరోలు ఇద్దరూ ఎంతో త్యాగం చేసి ఈ మూవీ చేశారు. నిజానికి ఈ సినిమాకు వాళ్ళు డెడికేట్ చేసిన రోజుల్ని పరిగణనలోకి తీసుకుంటే మరో రెండు మూడు సినిమాలు చేసి ఉండేవారు. కానీ వాటికి దూరంగా ఈ సినిమాకు కట్టిబడి ఉన్నారంటేనే… రెమ్యూనరేషన్ కు ప్రాధాన్యం ఇవ్వకుండా ఈ సినిమాకు వర్క్ చేసినట్టే కదా! అంటూ కితాబిచ్చాడు.