సోహెల్, మృణాళిని రవి జంటగా రాజేంద్రప్రసాద్, మీనా, అలీ, సునీల్ ప్రధాన తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఆర్గానిక్ మామ- హైబ్రీడ్ అల్లుడు’. కల్పన చిత్ర బేనర్‌పై కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారంనాడు ఈ చిత్రం షూటింగ్ బేగంపేట్‌లోని రమడా మనోహర్ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్.వి. కృష్ణారెడ్డి జన్మదిన వేడుకను చిత్ర యూనిట్ నిర్వహించింది. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ”జర్నలిస్టు మిత్రులు, చిత్ర యూనిట్ సమక్షంలో ఎస్.వి. కృష్ణారెడ్డి జన్మదిన వేడుక జరగడం ఆనందంగా వుంది. ప్రతి ఏడాది వచ్చేదే. కానీ ఆత్మీయుల సమక్షంలో జరుపుకోవడంలో ఆనందం వేరుగా వుంటుంది. ఈ చిత్ర కథ నచ్చి ఎస్.వి.కృష్ణారెడ్డి గారు సినిమా తీయడానికి కారణమైంది. అందుకు కల్పనగారు ఎంతో ప్రోత్సహించారు. సోహెల్ హీరోగా బాగా చేస్తున్నాడు. మృణాళిని రవి మంచి నటి. చాలా నాచురల్‌గా చేస్తుంది. తెలుగులో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందనే నమ్మకముంది” అని అన్నారు.
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ, ”ఎస్.వి. కృష్ణారెడ్డి పెద్ద బేనర్‌లో చేశాడు. సక్సెస్ కొట్టాడు. అనేలా ఈ సినిమా వుంటుంది. మొన్నీమధ్య అలీ కలిశాడు. 22 ఏళ్ళ క్రితం నన్ను హీరోగా పరిచయం చేసి సక్సెస్ చేశాడు. ఇప్పుడు సోహెల్ తో ఎస్.వి. కృష్ణారెడ్డి సినిమా చేస్తుంటే ఆ వైబ్రేషన్స్ వస్తున్నాయి అని చెప్పాడు. ఈ సినిమా ఆయనకు గొప్ప మలుపు కావాలని కోరుకుంటున్నాను. మీరందరికీ తెలీని ఓ విషయం చెబుతా. హీరోగా ఎస్.వి. కృష్ణారెడ్డి పరిచయం అయినప్పుడు ఆయన పేరు కళ్యాణ్. నా పేరు కళ్యాణ్. అందుకే ముందుగా సి.కళ్యాణ్ అనే పేరు పెట్టుకున్నాను. ఆ తర్వాత దర్శకుడు అయ్యాక ఎస్.వి. కృష్ణారెడ్డి పేరును యథాతథంగా వుంచుకున్నారు. ఆయనతో 38 ఏళ్ళ జర్నీ, మా జర్నీ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకముంది” అని అన్నారు.
ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ”మనిషికి అదృష్టం వరించాలి. అది నిజం. నాకు అచ్చిరెడ్డిగారి లాంటి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. నన్ను దిశానిర్దేశం చేసింది ఆయనే. ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా ప్రతిక్షణం నా భవిష్యత్ గురించే ఆలోచిస్తారు. ఐదేళ్ళ నుంచి ఐదు కథలు రాసుకున్నాను. అలా రాయడానికి కారణం అచ్చిరెడ్డి గారే. ప్రతి డైలాగ్ ఆయనకు వినిపించేవాడిని. కొత్త కొత్త పదాలు పుడుతున్నాయ్ అనేవారు. ఇక నిర్మాతగా ఎవరు అని ఆలోచిస్తుండగా, దేవుడు అదృష్టం రూపంలో కల్పన గారి రూపంలో పంపాడు. ఆమె మంచి నిర్మాత. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం చేస్తున్నారు. అందుకు తగిన నటీనటులును అందించేవారు. నా కథను విని నాన్‌స్టాప్‌గా ఆమె నవ్వారు. రేపు ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతారు” అని చెప్పారు. ఈ సందర్బంగా హీరో సోహెల్, హీరోయిన్ మృణాళిని రవి, కృష్ణ భగవాన్, కెమెరామేన్ రాం ప్రసాద్, నిర్మాత కల్పన తదితరులు సినిమా గురించి, కృష్ణారెడ్డితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.