Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ విజయపథంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సుస్మిత కొణిదెల విలేకరుల సమావేశంలో ‘వాల్తేరు వీరయ్య’ విశేషాలని పంచుకున్నారు.
చిరంజీవి కాస్ట్యూమ్స్ డిజైన్ గురించి చెబుతూ, ”ఈ కథ విన్నపుడు వాల్తేరు, పోర్ట్, ఫిషర్ మ్యాన్ అని చెప్పగానే ఒక ఇమాజినేషన్ వచ్చింది. దర్శకుడు బాబీ ఆలోచనలతో అవి చాలా వరకూ మ్యాచ్ అయ్యాయి. మాకు వింటేజ్ చిరంజీవి గారి లుక్ కావాలని బాబీ చెప్పారు. మేము ఆయన్ని ఎలా చూస్తూ పెరిగామో అలా వింటేజ్ ‘గ్యాంగ్ లీడర్’ లాంటి లుక్ కావాలని అన్నారు. నాన్నగారి సినిమాలన్నీ మాకు తెలుసు. ఎన్నోసార్లు చూశాం. దీంతో పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. అలాగే ఈ సినిమాలో రవితేజ గారికి, శ్రుతి హాసన్ గారికి వారి వారి డిజైనర్స్ పని చేశారు. అందరం మంచి సమన్వయంతో పని చేశాం” అని చెప్పారు. తన తండ్రితోనూ కాస్ట్యూమ్స్ గురించి చర్చిస్తానని అంటూ ”నాన్నగారికి వున్న అనుభవం గొప్పది. ఒక సీన్ లో ఎలా కనిపించాలో ఆయనకే బాగా తెలుసు. ఇందులో కూడా ఆయన సూచనలు ఇచ్చారు. లుంగీ డిజైన్, ఎక్కడ ఎలాంటి కళ్ళజోడు వుంటే బావుంటుందనే కొన్ని సూచనలు ఇచ్చారు” అని తెలిపింది.
తన తండ్రి చిరంజీవిని ‘వాల్తేరు వీరయ్య’గా తెర మీద చూసి ఎంజాయ్ చేశానని చెబుతూ, ”ఇది నాన్నగారికి మోస్ట్ కంఫర్టబుల్ జోన్. ఆయన్ని చూస్తున్నపుడు అద్భుతంగా, ఒక పెద్ద పండగలా అనిపించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ కి వెళ్తున్న ప్రతి రోజూ పండగలానే వుండేది. మా అమ్మ అయితే… నాన్నగారి లుక్ టెస్ట్ చేసినప్పుడే ఏది బావుంటుందో చెప్పేస్తుంది. అమ్మ ఇన్ పుట్స్ కూడా చాలా వుంటాయి. అలాగే చరణ్ తప్పకుండా కాల్ చేసి, ఏది ఎలా ఉంది చెబుతుంటాడు” అని అంది.
కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఉంటూనే నిర్మాణం పైనా దృష్టి పెట్టిన విషయం గురించి తెలుపుతూ, ”ఇప్పటికే ఓ వెబ్ సీరిస్, మరో ఓటీటీ మూవీ తీశాం. ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వృత్తిపరంగా ‘భోళా శంకర్’ జరుగుతోంది. అలానే రెండు వెబ్ సీరిస్ లపై వర్క్ చేస్తున్నాం. నిజానికి నాన్నగారితో సినిమా నిర్మించాలని అందరు నిర్మాతలు మాదిరిగానే నాకూ ఉంది. అందరికీ చెప్పినట్టే నాన్న గారు ‘ముందు మంచి కథ తీసుకురా! వెంటనే చేద్దాం’ అంటున్నారు. మేము కూడా ఆ కథాన్వేషణలో వున్నాం” అని సుస్మిత చెప్పింది. సో… రాబోయే రోజుల్లో తన కుమార్తె సుస్మిత నిర్మించే చిత్రంలో చిరంజీవి హీరోగా నటించే ఆస్కారం ఉంది.