నవతరం కథానాయకుల్లో సుశాంత్ ఇంకా తగిన గుర్తింపు కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. కాళిదాస్తో మొదలైన సుశాంత్ నటనాప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సినీజనం కోరుకొనే బిగ్ హిట్ ఆయన ఖాతాలో ఇంకా చేరలేదనే చెప్పాలి. అయితే నటునిగా మాత్రం ఇప్పటి దాకా నటించిన చిత్రాల ద్వారా మంచి మార్కులే సంపాదించాడు సుశాంత్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల...వైకుంఠపురములో సుశాంత్ గెటప్ బాగుందని అతను అలా కంటిన్యూ అయిపోతే మరిన్ని మంచిపాత్రలు దరి చేరుతాయని సినీజనం అంటున్నారు. ప్రస్తుతం సుశాంత్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న రావణాసురలో రాముని పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా సుశాంత్ కు మంచి మార్కులు అందిస్తే, తప్పకుండా సుశాంత్ తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నవాడు అవుతాడు. చిత్రసీమలోనే కాదు, ఏ రంగంలోనైనా రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. కానీ, కృషిని నమ్మిన వారికి సినిమా రంగం తప్పకుండా అవకాశాలు కల్పిస్తుందని ఎందరి జీవితాలో నిదర్శనంగా నిలిచాయి. సుశాంత్ తనపై తనకున్న విశ్వాసంతోనే ముందుకు సాగుతున్నాడు.
తల్లివైపు తాత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి వైపు తాత పేరుమోసిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏ.వి.సుబ్బారావు – ఇరువైపులా సినిమా వాతావరణమే! మరి సుశాంత్ మనసు సినిమా రంగంవైపు పరుగులు తీయకుండా ఉంటుందా? పైగా మేనమామ నాగార్జున టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. గ్లామర్ ఫీల్డ్ కు ఎట్రాక్ట్ కాకుండా ఉండలేరు కదా! సుశాంత్ సైతం అదే చేశాడు. తొలి చిత్రం కాళిదాస్లోనే బ్లడ్ బాయిలవుతుంది... అంటూ మాస్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. రెండో సినిమా కరెంట్లో సింగిల్ హ్యాండ్ స్టాండ్ తో అబ్బో అనిపించాడు. అడ్డా, ఆటాడుకుందాం రా వంటి చి్త్రాల్లోనూ హీరోగా అలరించే ప్రయత్నం చేశాడు. కానీ, చి.ల.సౌ. సుశాంత్ కు హీరోగా తగిన విజయాన్ని అందించింది.
అదే సమయంలో త్రివిక్రమ్ రూపొందించిన అల..వైకుంఠపురములో చిత్రంలో కీలక పాత్రలోనే కనిపించి అలరించాడు సుశాంత్. ఆ సక్సెస్ సుశాంత్ లో కాన్ఫిడెన్స్ పెంచింది. కానీ, ఇచ్చట వాహనములు నిలుపరాదు మాత్రం నిరుత్సాహ పరచింది. ఈ నేపథ్యంలో హీరోగా కంటే నటునిగా మంచి మార్కులు సంపాదించాలనే సుశాంత్ అభిలాషను అభినందించి తీరవలసిందే. రవితేజ రావణాసురలో రామునిలాంటి పాత్రలో సుశాంత్ కు ఓ మంచి అవకాశం దొరికింది. ఈ ప్రయత్నంలోనూ సుశాంత్ మంచి మార్కులు సంపాదించాలని తపిస్తున్నాడు. ఆ ప్రయత్నం ఫలించి, సుశాంత్ తపనకు తగ్గ పాత్రలు భవిష్యత్ లో మరిన్ని పలకరించాలని, నటనలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటాడని ఆశిద్దాం.