తమిళనాట కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు అగ్ర దర్శకులు. తెలుగులో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలసి గిల్డ్ పేరుతో సినిమాలు తీస్తున్నట్లు తమిళనాట అగ్రదర్శకులందరూ కలసి ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. తెలుగులో నిర్మాతలు ఎవరికివారు హీరోలతో టై అప్ పెట్టుకుని సినిమాలు తీస్తుంటే తమిళంలో మాత్రం దర్శకులందరూ కలసి ఒకే గొడుగు కింద సినిమాలు తీయబోతున్నారు. మణిరత్నం, శంకర్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, మిస్కిన్, లింగుస్వామి, మురుగదాస్, బాలాజీ శక్తివేల్, శశి, లోకేశ్ కనకరాజ్ వంటి టాప్ డైరక్టర్స్ ఈ నిర్మాణ సంస్థలో భాగస్వాములు. వారు స్థాపించిన నిర్మాణ సంస్థ పేరు రెయిన్ ఆన్ ఫిల్మ్.
సూర్యతో సూపర్ హీరో సినిమా
ఈ సంస్థలో తొలి సినిమాను సూర్య హీరోగా తెరకెక్కించబోతున్నారు. దీనికి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడట. సినిమాకి ‘ఇరుంబు కై మాయావి’ అనే టైటిల్ నిర్ణయించారట. 1961లో వచ్చిన డి.సి. కామిక్ నవల ‘ది స్టీల్ క్లా’ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుందట. ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయి స్టీల్ ప్రొస్థెటిక్ ధరించిన సూపర్ హీరోగా సూర్య కనిపిస్తాడట. ప్రయోగశాలలో ప్రమాదం తర్వాత స్టీల్ హ్యాండ్ మినహా తను ఎలా కనిపించకుండా కథను నడిపిస్తాడనేదే సినిమా అట. లోకేశ్ ప్రస్తుతం కమల్ హాసన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సూర్య సైతం పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘ఎదిరిక్కుం తునిందవన్’ షూటింగ్ లో ఉన్నాడు. మరి టాప్ తమిళ్ డైరెక్టర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సక్సెస్ అయితే తెలుగులోనూ ఇటువంటి ప్రయోగానికి శ్రీకారం చుడతారేమో చూద్దాం.