టాలీవుడ్ లో మంచి సినిమాలను వెలికి తీసి తెలుగు ప్రేక్షకులకు అందించడంలో సురేష్ ప్రొడక్షన్స్ ముందు వరుసలో ఉంటుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ట్యాలెంట్ ఉన్న నటులను ఒడిసిపట్టాలన్నా.. వేరే భాషలో హిట్ అయినా సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలన్నా దగ్గుబాటి వారసులకే చెల్లింది. అలానే వెంకటేష్ టాలీవుడ్ లో ఏ హీరో చేయనన్ని రీమేక్ లు చేసి హిట్ లు అందుకున్నాడు. ఇక సురేష్ బాబు సైతం వేరే భాషలో సినిమా హిట్ అనడం ఆలస్యం రీమేక్ హక్కులను సొంతం చేసుకొని కొత్త సినిమాను పట్టాలెక్కించేస్తారు. తాజాగా అదే పని చేశాడు కూడా.
ఇటీవల తమిళ్ లో భారీ హిట్ ని అందుకున్న మానాడు సినిమా తాలుకా రీమేక్ హక్కులని తెలుగు సహా అన్ని ఇండియన్ భాషలకు గాను సురేష్ ప్రొడక్షన్స్ భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా కూడా తెలిపారు.. లూప్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా శింబుకు, ఎస్ జె సూర్యకు భారీ హిట్ ని అందించింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఈ రీమేక్ హక్కులు కొనడం ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదలై సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
హిట్ సినిమా కావడంతో దాదాపు తెలుగు ప్రేక్షకులందరూ వీక్షించేశారు. అలాంటప్పుడు మళ్లీ ఈ రీమేక్ హక్కులను కొని రీమేక్ చేసి.. రిలీజ్ చేయడం ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు తెలుగు డబ్ అయినా కొన్ని సినిమాలు రీమేక్ చేసి హిట్ అందుకోలేదా..? అంటూ కొన్ని సినిమాలను ఉదాహరణగా చెప్తున్నారు. అప్పుడంటే ఓటిటీ ప్లాట్ ఫార్మ్ ల జోరు లేదు.. టీవీ లో వస్తేనో, యూ ట్యూబ్ లో ఉంటేనే చూడడం తప్ప వేరే దారి ఉండేది కాదు.. కానీ, ఇప్పుడు అలాకాదు కదా ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఓటిటీ ల రాజ్యమే నడుస్తోంది.. ఇలాంటి సమయంలో ఈ రిస్క్ అవసరమా అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా సురేష్ బాబు ఈ రీమేక్ హక్కులను కొని ఏం చేద్దామనుకుంటున్నారు అనేది నెటిజన్ల ప్రశ్న .. మరి సురేష్ బాబు మానాడు రీమేక్ ని సెట్స్ పైకే తీసుకెళ్తాడా..? లేదా అనేది చూడాలి.