Nandamuri Balakrishna: టాలీవుడ్ హీరో, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మాతలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పన్ను రాయితీ విషయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా నిర్మాతలు సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎదుగురు లకు ఆదేశాలు జారీచేసింది. బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. అయితే చారిత్రాత్మక చిత్రం కావున ఈ సినిమాకు పన్ను రాయితీ ఇవ్వాలంటూ అప్పట్లో బాలకృష్ణ అడగడం, ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను రాయితీ ప్రకటించడం జరిగాయి. కాగా, ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినా టికెట్ ధర తగ్గించకుండా అదే రేటుకు టికెట్స్ అమ్మడంపై సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిర్మాతలు పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని, పన్ను రాయితీ పొందిన డబ్బు తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని కోరుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ కేసుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం విచారణ జరిపి నిర్మాతలు సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎదుగురు తెలంగాణ, ఏపీ ప్రభుత్వానికి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది.