జూలై 26 విజయ్ దివస్! 1999 జూలై 26న పాకిస్తాన్ పై భారత సైనికులు పైచేయి సాధించారు. దానికి మూడు నెలల ముందు నుండి పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి సొంతం చేసుకున్న రోజు అది. దాదాపు అరవై రోజుల పాటు సాగిన కార్గిల్ యుద్ధంలో పాక్ సైనికులను, చొరబాటు దారులను అడ్డుకుని భారత సైన్యం విజయకేతనం ఎగరేసిన రోజు అది. 22 సంవత్సరాల క్రితం ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా అమరుడయ్యారు. అతని జీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘షేర్షా’ చిత్రం ట్రైలర్ ను విజయ్ దివస్ సందర్భంగా ఆదివారం కార్గిల్ లో సైనికుల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, దర్శకుడు విష్ణువర్థన్, చిత్రనిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ తో పాటు విక్రమ్ బాత్రా సోదరుడు విశాల్ హాజరయ్యాడు.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, ‘2015లో ఈ చిత్ర సహ నిర్మాతల్లో ఒకరైన షబ్బీర్ బాక్స్ వాలా తనను కలిశారని, ఇంతకాలానికి సినిమా పూర్తి అయ్యి, విడుదల కాబోతుండటం ఆనందంగా ఉందని, ఇప్పటికి తమ కల సాకారమైంద’ని అన్నారు. 1999లో కార్గిల్ వార్ సమయంలో గాయపడిన తన తోటి సైనికుడిని రక్షించే క్రమంలో విక్రమ్ బాత్రా ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో కూడా నలుగురు పాకిస్తానీ సైనికులను హతమార్చాడు. గాయపడిన సైనికుడిని సురక్షితమైన స్థలానికి చేర్చే క్రమంలో పాకిస్తాన్ సైనికుల చేతిలో అమరుడయ్యాడు. ఆర్పీజీ వార్ హెడ్ నుండి వచ్చిన మందు గుండు విక్రమ్ తలను విచ్ఛిన్నం చేసింది. వీర మరణాన్ని పొందిన విక్రమ్ కు భారత ప్రభుత్వం పరమ వీకచక్ర బిరుదును ప్రదానం చేసింది.
‘తన నట జీవితంలో తొలిసారి రియల్ లైఫ్ హీరో పాత్ర చేశానని, ఈ ప్రయాణం ఐదేళ్ళ క్రితం మొదలైందని, విక్రమ్ బాత్రా పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నాన’ని హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తెలిపాడు. ‘ఇండియన్ ఆర్మీ ముందు నిలబడి మాట్లాడటం తనకు ఇదే మొదటిసారి’ అని చెప్పిన కియారా అద్వాని, దేశ సేవ చేస్తున్న ఆర్మీ జవాన్లకు, వారికి సపోర్ట్ గా నిలిచిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమాలో విక్రమ్ ప్రియురాలు డింపుల్ చీమా పాత్రను తాను పోషించానని, కొన్ని సినిమాలు ప్రొఫెషనల్ గా మార్పును తీసుకొస్తే, కొన్ని సినిమాలు పర్శనల్ గా మార్పును తీసుకొస్తాయని, ఇది అలాంటి సినిమా అని కియారా అద్వాని చెప్పింది. పలు తమిళ చిత్రాలతో పాటు తెలుగులో ‘పంజా’ చిత్రాన్ని రూపొందించిన విష్ణువర్థన్ ఈ మూవీతో దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ‘షేర్షా’ సినిమాను ఆగస్ట్ 12న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మూవీ ట్రైలర్ విడుదలైన మరుక్షణం నుండి బాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్ర బృందాన్ని అభినందనలతో ముంచెత్తడం ప్రారంభించారు. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, అలియాభట్, వరుణ్ ధావన్… ఇలా సీనియర్ అండ్ యంగ్ స్టార్ హీరోస్ అంతా ‘షేర్షా’ ట్రైలర్ సూపర్ గా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపించారు.