‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్.బి. చౌదరి గారు ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారని వస్తున్న వార్తలు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. శాబ్దాల కాలంగా భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను నిర్మించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. దక్షిణాది సినీ సామ్రాజ్యంలో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అనే పేరు వినబడగానే మన కళ్ల ముందు మెదిలేది ఒకే ఒక్క వ్యక్తి… ఆయనే ఆర్.బి. చౌదరి. కేవలం ఒక నిర్మాతగానే కాకుండా, ఎందరో దర్శకులకు, నటీనటులకు లైఫ్ ఇచ్చిన ‘గాడ్ ఫాదర్’ గా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
సాధారణంగా సినిమా నిర్మాణం అంటే కేవలం డబ్బు పెట్టుబడి పెట్టడం అని అందరూ అనుకుంటారు. కానీ, ఆర్.బి. చౌదరి ఆ నిర్వచనాన్ని మార్చేశారు. కథలో దమ్ముంటే, చిన్న హీరోతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని నిరూపించిన ఘనత ఆయనది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 90కి పైగా చిత్రాలను నిర్మించి, భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేశారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అంటే ఒక నమ్మకం. ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘కలిసుందాం రా’, ‘నువ్వు వస్తావని’, ‘సింహరాశి’ వంటి చిత్రాలు ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూస్తాం. కుటుంబ విలువలను, ప్రేమని, బాధ్యతను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించడంలో ఆయన శైలే వేరు. విక్రమ్, విజయ్ వంటి నేటి సూపర్ స్టార్లు తమ కెరీర్ ఆరంభంలో చౌదరి బ్యానర్ లో నటించి గుర్తింపు పొందిన వారే. తన కుమారులు జీవా మరియు జితన్ రమేష్‌లను కూడా పరిశ్రమకు పరిచయం చేసి, సక్సెస్ ఫుల్ హీరోలుగా తీర్చిదిద్దారు.
