రచయితగా ‘సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ లాంటి చిత్రాలకు సంభాషణలు అందించి ‘బుర్రకథ’తో దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు ఇప్పుడు బిగ్ బాస్ విజేత వీజే సన్ని హీరోగా ‘అన్ స్టాపబుల్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మే 31వ తేదీ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు బి. గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్, నటుడు బిత్తిరి సత్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సన్నీ మాట్లాడుతూ, ”డైమండ్ రత్నబాబుకు సినిమా అంటే పిచ్చి. తను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. బిగ్ బాస్ తర్వాత నటుడుగా వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని ఈ మూవీ అంగీకరించాను.
ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడుగా నేను నూరు శాతం కష్టపడి పని చేస్తాను. రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఈ సినిమాకు త్రిమూర్తులు వంటి నిర్మాతలతో పాటు మంచి టీం దొరికారు. అలాగే దిల్ రాజు, హరీష్ శంకర్ గారి బ్లెస్సింగ్ తో మరో సినిమా చేస్తున్నాను” అని అన్నారు.
దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ, ”అన్‌స్టాపబుల్ అనే టైటిల్ బాలయ్య బాబుది. ఇప్పుడు తన టైటిల్ తో వస్తున్న మాకు బాలయ్య బాబు ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. నిర్మాతలు బాగుండాలి అని కోరుకునే సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని అంకితం చేస్తున్నాం. జూన్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ చేసి జూన్, జులై నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకొని దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని అన్నారు.
రంజిత్ రావ్. బి నిర్మిస్తున్న ఈ సినిమాకు షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సప్తగిరి, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, మణిచందన, షకలక శంకర్, విరాన్ ముత్తమ్ శెట్టి, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి, ‘వకీల్ సాబ్’ ఫేమ్ లిరీష, ‘డీజే టిల్లు’ ఫేమ్ మురళి గౌడ్, ఐమాక్స్ వెంకట్, సురేష్ కొండేటి, విక్రమ్ ఆదిత్య, రోని, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఇందులో కీలక పాత్రలు పోషించబోతున్నారు.