Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!

Hide And Silk

Hide And Silk

Hide & Silk: కంటెంట్ ఉన్న సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుహాస్. రీసెంట్‌గా ‘మండాడి’ సినిమాలో విలన్‌గా కనిపించి మెప్పించిన ఆయన, ఇప్పుడు మళ్లీ రూట్ మార్చి ఓ స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. సుహాస్ హీరోగా రాజేంద్ర బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘హైడ్ & సిల్క్’ (Hide & Silk) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో ‘లబ్బర్ పందు’ ఫేమ్ సంజనా కృష్ణమూర్తి (సంజన ఎకె) హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి సుహాస్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ ప్రోమో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో సుహాస్ చేనేత కార్మికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సంభాషణలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. “చీరను మెషీన్లతో అయినా, ఇంకే రకంగానైనా నేయవచ్చు.. కానీ మన సొంత చేనేత మగ్గంపై ఒక్కసారి నేసి చూడు.. ఎందుకంటే నేత అనేది కేవలం ఒక పని మాత్రమే కాదు, అదొక గొప్ప కళ!” అంటూ చేనేత గొప్పదనాన్ని వివరించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రోమోలో అత్యంత ఆలోచింపజేసే అంశం.. చీర ప్రాధాన్యత గురించి చెప్పే మాటలే. “ప్రతి గింజపై తినేవాడి పేరు రాసిపెట్టి ఉన్నట్లే.. నేసే ప్రతి చీరకూ దాన్ని కట్టుకోవాల్సిన ఓ స్త్రీ ముందే రాసిపెట్టి ఉంటుంది. చీర నేస్తున్నప్పుడు దానికి అందం రాదు.. మనం నేస్తుంటే అది ఒక స్త్రీని ఎంచుకుంటుంది, ఆమె కట్టుకున్నప్పుడే ఆ చీరకు అసలైన అందం వస్తుంది” అనే పోయెటిక్ డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్‌గా కుదిరాయి.

జీవితంలో తను మొదటిసారి నేసిన చీరను ఏ అమ్మాయి కట్టుకుంటుందో, ఆమెకు తెలియకుండానే ఆ అమ్మాయిని ఎలాగైనా ఒక్కసారైనా చూడాలని తపించే ఓ యువకుడి ప్రయాణమే ఈ సినిమా అని ప్రోమోతో హింట్ ఇచ్చేశారు మేకర్స్. “నేను నేస్తున్న మొదటి చీర ఇది.. అంటే ఈ చీర కూడా తనను కట్టుకునే అమ్మాయిని ఎంచుకుందా? అసలు తను ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? ఆమెను ఒక్కసారైనా చూడటం ఓ అద్భుతం కాదా?” అంటూ సుహాస్ పలికే మాటలు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని గుర్తుచేస్తున్నాయి. స్టోన్ బెంచ్ స్టూడియోస్, మిస్రీలాల్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సుహాస్.. ఈసారి రొమాంటిక్ బాట పట్టి చేస్తున్న ‘హైడ్ & సిల్క్’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.