Tovino Thomas: మలయాళ కథానాయకుడు టొవినో థామస్ నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి, ఓటీటీ ప్లాట్ పామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. విభిన్న కథాంశాలను ఎంపిక చేసుకుని టొవినో సినిమాలు చేస్తుండటంతో తనకంటూ ఓ గుర్తింపును తెలుగులోనూ తెచ్చుకున్నాడు. ఇటీవల టొవినో థామస్ కు ‘మిన్నల్ మురళీ’ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో అతని పాత మలయాళ చిత్రాలనూ అనువదించి, ఓటీటీ ప్లాట్ పామ్స్ లో స్ట్రీమింగ్ చేయడానికి ఆ యా వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. అలా ఈ నెల 25న ఆహాలో టొవినో థామస్ నటించిన ఓ మలయాళ చిత్రం తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ కాబోతోంది. 2017లో టొవినో ‘ఒరు మెక్సికన్ అపరాథ’ సినిమాలో నటించాడు. టామ్ ఎమ్మాటీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమ్యూనిస్టు పార్టీ కాలేజ్ స్టూడెంట్ గా టొవినో థామస్ నటించాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
ఎర్నాకులంలోని మహారాజా కాలేజ్ లో కె.యస్.యు. (కేరళ స్టూడెంట్ యూనియన్) విద్యార్థులకు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎస్.ఎఫ్.ఐ. (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)కు మధ్య పెద్ద గొడవే జరిగింది. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలను బేస్ చేసుకుని వివిధ రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవాలని చూశాయి. ఈ సంఘటనల ఆధారంగానే దర్శకుడు టామ్ ఎమ్మాట్టీ ఈ సినిమాను రూపొందించాడు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పనిచేసిన టొవినో థామస్ పెద్దయ్యాక మహారాజా కాలేజీలోనే చేరి స్టూడెంట్ ఎలక్షన్స్ లో తలదూర్చుతాడు. ఈ స్టూడెంట్ పాలిటిక్స్ కు ఓ చక్కని ప్రేమకథనూ దర్శకుడు మిళితం చేశారు. ఇటీవల తెలుగులో వచ్చిన ‘గంధర్వ’ మూవీలో నటించిన గాయత్రి సురేశ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడీ ‘ఒరు మెక్సికన్ అపరాథ’ను తెలుగులో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’గా డబ్ చేసి, 25న స్ట్రీమింగ్ చేస్తున్నారు.