Srikanth Sriram: శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా డాక్టర్ రవికిరణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న సినిమా షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది. దీన్ని డాక్టర్ ఉదయ్ కె రెడ్డి పాల్వాయ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుధీర్ వర్మ క్లాప్ కొట్టగా, ‘జార్డిరెడ్డి’ ఫేమ్ సందీప్ మాధవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. డాక్టర్ రవికిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు రవికిరణ్ మాట్లాడుతూ, ”ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతోంది. పోస్ట్ ట్రూమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. జనవరి 2 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది” అని తెలిపారు. హీరో శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, ”డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను. డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ తీసిన ఇండిపెండెంట్ చిత్రం ‘థ రాంగ్ స్వైప్’ నాకు చాలా నచ్చింది. దాంతో చెన్నయ్ పిలిచి కథను విని ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాను. యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా గురించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తాను” అని అన్నారు.
నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ, ”ఈ సినిమా విజువల్స్ బాగా ఉండబోతున్నాయి. డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ రాసుకున్న కథ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండబోతోంది. నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్ ను చేస్తున్నాను” అని అన్నారు. ఓ మంచి సినిమాలో నటించే ఛాన్స్ తనకు దక్కడం ఆనందంగా ఉందని హీరోయిన్ హ్రితిక తెలిపింది. త్వరలో ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తూ, ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.