Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. అన్నమయ్య కీర్తనలో అసభ్యకరంగా నటించిందని ఆమెను నెటిజన్స్ ఏకిపారేస్తుండగా.. అన్నమయ్య భక్తులు ఆ వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమయిన శ్రావణి ఒక యూట్యూబ్ ఛానెల్ ను క్రియేట్ చేసుకొని అందులో హెల్త్, మేకప్ కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా భార్గవి తన యూట్యూబ్ ఛానెల్ లో ఒకపరి అంటూ అన్నమయ్య కీర్తనను పాడిన వీడియోను షేర్ చేసింది. సాంగ్ అంతా బానే ఉన్నా.. ఆ వీడియోలో ఆమె కాళ్లు, చేతులూ ఊపుతూ నటించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. ఎంతో భక్తితో ఆలపించాల్సిన కీర్తనను.. ఇలా క్యాజువల్ గా ఒక మహిళ పాడడం మింగుడు పడడంలేదంటూ కొంతమంది భక్తులు శ్రావణ భార్గవిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ వివాదం కాస్తా టీటీడీ మండలి వరకు వెళ్లడంతో మరింత సంచలనంగా మారింది.
తిరుపతి టీటీడీ కమిటీ నుంచి అన్నమయ్య ట్రస్ట్ సభ్యుడు శ్రావణ భార్గవి తో ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. ఇందులో అన్నమయ్య ట్రస్ట్ సభ్యుడు మాట్లాడుతూ.. వీడియోను డిలీట్ చేయాల్సిందిగా కోరగా.. శ్రావణ భార్గవి వీడియోను డిలీట్ చేయడం కుదరదని చెప్పింది.. అసలు డిలీట్ ఎందుకు చేయాలి అని ప్రశ్నించింది. అందుకు ఆయన అశ్లీలంగా ఉందని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అని తెలుపగా.. అందులో అశ్లీలం ఎక్కడ ఉందో చూపించాలని తెలిపింది. వీడియోను డిలీట్ చేయడం కుదరదని, ఆ వీడియో కోసం తాను చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.