(జనవరి 10తో ‘అడవిలో అన్న’కు 25 ఏళ్ళు)
ఎర్రజెండా సినిమాలకూ జనం జేజేలు పలుకుతున్న రోజుల్లో కొందరు స్టార్ హీరోస్ సైతం అటువైపు అడుగులు వేశారు. అలా మోహన్ బాబు నేను సైతం అంటూ విప్లవభావాలతో పాటు, ఆదర్శాలనూ పెనవేసి తెరకెక్కించిన చిత్రం ‘అడవిలో అన్న’. బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసి, నిర్మించిన చిత్రం ‘అడవిలో అన్న’. 1997 జనవరి 10న ఈ సినిమా విడుదలయింది. రెడ్ మార్క్ మూవీస్ కు అప్పట్లో తన బాణీలతో జనం మెచ్చిన పాటలు వినిపించారు వందేమాతరం శ్రీనివాస్. ‘అడవిలో అన్న’లో కూడా వందేమాతరం బాణీలు భలేగా ఆకట్టుకున్నాయి.
జనం కోసమే మనం అంటూ పోరాటం చేసిన ఓ ప్రజాపక్ష నాయకుని తనయుడు శివాజీ. ఉన్నత చదువులు చదువుకున్నా తండ్రి బాటలోనే పయనించి జనం కోసం నిలబడతాడు. బడుగుల కోసం పిడికిలి బిగిస్తాడు. ఉద్యమం చేపడతాడు. బూర్జువాల దాష్టీకానికి బలయ్యే వారికి అండ అవుతాడు. ఆ జనం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడతాడు. అతణ్ణి ఓ నీచుడైన పోలీస్ అధికారి కూతురు ప్రేమిస్తుంది. ఆమె కూడా తండ్రి అసలు రూపం తెలుసుకొని, ప్రేమించిన వానితోనే పోరాటంలోకి దిగుతుంది. చివరకు అన్యాయం చేసేవారిని అంతమొందిస్తారు. ప్రతి బడుగు జీవిలోనూ చైతన్యం చిగురింప చేస్తారు. తనకోసం జీవించేవాడు మనిషి, ఎదుటివాడి కోసం పోరాడేవాడు మహర్షి అని చాటుతూ శివాజీ కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.
‘అడవిలో అన్న’లో రోజా నాయికగా నటించారు. మాస్టర్ మనోజ్ కుమార్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఏవీయస్, ఎమ్.వి.ఎస్.చౌదరి, రామిరెడ్డి, శ్రీహరి, రఘునాథ రెడ్డి, సుమిత్ర, రజిత, రాజేశ్వరి, శకుంతల ముఖ్యపాత్రధారులు. ఇందులో పరుచూరి గోపాలకృష్ణ, కాస్ట్యూమ్స్ కృష్ణ అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు పరుచూరి బ్రదర్స్ అందించారు. గూడ అంజయ్య, జయరాజ్, అశోక్ తేజ, జలదంకి సుధాకర్ పాటలు రాశారు. ఇందులోని అన్ని పాటల్లోకీ ఏసుదాస్ గానం చేసిన “వందనాలమ్మా… అమ్మా…వందనాలమ్మా…” పాట విశేషాదరణ పొందింది. “సమ్మక్క సారక్క జాతరబోయొచ్చిన…”, “అద్దాల మేడకు…ఆకుల గుడిసెకు…”, “ఇది తిరగబడ్డ తెలంగానమూ…ఇది రగులుతున్న ఆంధ్రదేశమూ…”, “బారెడు తుపాకి పట్టి…”, “దున్నెటోడిదే భూమిరా…” వంటి పాటలూ ఆకట్టుకున్నాయి.
‘అడవిలో అన్న’ విడుదలైన రోజునే బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’ కూడా జనం ముందు నిలచింది. ఈ రెండు చిత్రాలలోనూ రోజా నాయికగా నటించడం విశేషం. ఇక ఇదే రోజున విడుదలైన వెంకటేశ్ ‘చిన్నబ్బాయి’ అంతగా అలరించలేకపోయింది. ‘అడవిలో అన్న’ మాత్రం కొందరిని మెప్పించగలిగాడు.