‘అమ్మ’ అన్న పదంలో ఉన్నవి రెండక్షరాలే- ఆ రెండు అక్షరాల్లోనే అమృతం మించిన మధురం దాగుంది. ఈ సత్యాన్ని చాటుతూ ఎన్నో చిత్రాలు తెలుగువారిని అలరించాయి. అయినా, కన్నతల్లిని గౌరవించే సంతానం ఎంతమంది ఉన్నారో కానీ, ప్రతీసారి అమ్మ ప్రాధాన్యం చెప్పవలసి వస్తూనే ఉంది. అమృతమయమైన అమ్మను కీర్తిస్తూ పాటలూ పలికించవలసి వస్తోంది. దర్శకరత్న దాసరి నారాయణ రావు తన తొలి చిత్రం ‘తాత-మనవడు’లోనే తల్లి గొప్పతనాన్ని చక్కగా తెరకెక్కించారు.
‘అమ్మ రాజీనామా’కు 30 ఏళ్ళు
అదే తీరున ఆయన రూపొందించిన మరో మరపురాని చిత్రం ‘అమ్మ రాజీనామా’. మన కళ్ళముందు అమ్మ ఉన్నప్పుడు ఆమె విలువ అంతగా తెలియదు. కానీ, అమ్మ కాసింత కనుమరుగు కాగానే, ఆమె ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. భూమి మీద ఎంతోమందికి ఇది అనుభవమే! ఆ సత్యాన్ని చాటుతూనే ‘అమ్మ రాజీనామా’ తెరకెక్కింది. 1991 డిసెంబర్ 27న విడుదలైన ‘అమ్మ రాజీనామా’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, కె.దేవీవరప్రసాద్, టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించడం విశేషం!
భారతి మంచి రచయిత్రి. కానీ, పదవీ విరమణ చేసిన భర్త, ఇంట్లో పిల్లలు, వారి పిల్లలు అందరూ కలసి ఉండడంతో వారందరి బాధ్యతను తానే తీసుకుని కుటుంబాన్ని నెట్టుకు వస్తుంటుంది. అయితే ఆమె విలువను ఎవరూ గుర్తించరు. పైగా, ప్రతి నెలా అందరమూ ఆమె చేతికే డబ్బులు ఇస్తున్నాం కదా అంటూ ఉంటారు. వారందరిలో మార్పు రాకపోవడానికి తన ప్రవర్తనే కారణమని తెలుసుకున్న భారతి, తాను కూడా అమ్మ పదవి నుండి విరమణ తీసుకుంటున్నానని చెబుతుంది.
దాంతో అందరూ అవాక్కవుతారు. ఇంట్లోంచి వెళ్ళి, ఇంటి ముందున్న చెట్టు నీడనే జీవిస్తూ రచన చేస్తుంది. ఆమె రచనకు మంచి ఆదరణ లభిస్తుంది. అదే సమయంలో తన మనవరాలు కాలుజారడం, చిన్నబ్బాయి చిక్కుల్లో పడడం అన్నీ తెలుస్తాయి. వారిని మళ్ళీ గట్టెక్కించడానికి తన కిడ్నీ కూడా అమ్ముకుంటుంది భారతి. ఆమె చేసిన త్యాగం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళందరూ స్వాగతం పలుకుతారు. ఎంతగానో పూజిస్తారు. అందరికీ దూరంగా వెళ్తున్నానని చెబుతుంది భారతి. ఆమెకు ఇంట్లోవాళ్లు వీడ్కోలు పలుకుతారు. కానీ, భర్త వచ్చి, ఆమె త్యాగం తెలుసుకుని కుమిలిపోతాడు. ఆమెతో పాటే వెళతాడు. గమ్యస్థానం వచ్చిందని భార్యకు చెబుతాడు. ఆమెలో పలుకు ఉండదు. ఆమె కన్నుమూసిందని తెలుసుకొని భర్త దుఃఖిస్తూ ఉండడంతో కథ ముగుస్తుంది.
తేజస్వి ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ‘అమ్మ రాజీనామా’లో శారద, సత్యనారాయణ, ప్రసాద్ బాబు, సాయికుమార్, చలపతిరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, మాడా, మాగంటి సుధాకర్, హనుమంతరావు, కవిత, రజిత, తులసి, అన్నపూర్ణ, పాకీజా, బేబీ మానస నటించారు. ఈ సినిమా ద్వారానే రాజ్ కుమార్, శ్రీశాంతి పరిచయం అయ్యారు. ఇందులోని “సృష్టి కర్త ఒక బ్రహ్మ… అతనిని సృష్టించెను అమ్మ…” పాటలో చిత్ర దర్శకులు దాసరి నారాయణరావు కనిపిస్తారు.
అశోక్ పటేల్ రాసిన మూలకథకు దాసరి నగిషీలు చెక్కారు. గణేశ్ పాత్రో సంభాషణలు పలికించారు. దాసరి, సీతారామశాస్త్రి పాటలు రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. “ఇది ఎవ్వరూ ఎవ్వరికీ…” పాటను దాసరి రాయగా, మిగిలిన పాటలను సీతారామశాస్త్రి రాశారు. ముఖ్యంగా ఇందులోని “ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం…” పాట ఈ నాటికీ జనాన్ని ఆకట్టుకుంటూనే ఉంది. ‘మదర్స్ డే’న ఎక్కడో ఒక చోట ఆ పాట వినిపిస్తూనే ఉండడం విశేషం. ‘అమ్మ రాజీనామా’ మంచి విజయం సాధించింది. కన్నడలో లక్ష్మి ప్రధాన పాత్రలో ‘అమ్మ’ పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది.