టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించి, తెలుగువారికి చేరువైన ఉత్తరాది భామ సోనాలీ బింద్రే. స్టైల్ ఐకాన్ గా పేరొందిన సోనాలీ బింద్రే పలు యాడ్స్ లో నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించింది. వెండితెరపై సోనాలీ నాజూకు సోకులు చూసి ఫిదా అయిన జనాన్ని బుల్లితెరపైనా మురిపించింది. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగా వ్యవహరించి అలరించారు. క్యాన్సర్ ను ధైర్యంగా జయించి పలువురికి స్ఫూర్తి కలిగించారు సోనాలీ బింద్రే!
సోనాలీ బింద్రే మహారాష్ట్ర కుటుంబంలో 1975 జనవరి 1న జన్మించారు. ఆమె తండ్రి సివిల్ సర్వెంట్. దాంతో పలు రాష్ట్రాల్లో ఆయన పనిచేశారు. బొంబాయిలో కొంతకాలం చదివిన సోనాలీ, తరువాత బెంగళూరు కేంద్రీయ విద్యాలయలో విద్యనభ్యసించారు. చదువుకొనే రోజుల్లోనే ఆమె మనసు మోడలింగ్ పైకి మళ్ళింది. తరువాత సినిమా రంగం నాజూకు షోకుల సోనాలీ బింద్రేను ఆహ్వానించింది. తొలి చిత్రం ‘ఆగ్’లోనే నటిగా తనదైన బాణీ పలికించి ఫిలిమ్ ఫేర్ అవార్డు పట్టేసింది సోనాలీ. మణిరత్నం తెరకెక్కించిన ‘బొంబాయి’ లో “హమ్మా హమ్మా…” పాటలో సోనాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలచి, జనం మదిని దోచింది. ఆ తరువాత తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలనే తపించారు సోనాలీ బింద్రే.
తెలుగులో సోనాలీ బింద్రే నాయికగా నటించిన తొలి చిత్రం కృష్ణవంశీ ‘మురారి’. ఇందులో ఆమె పోషించిన వసుంధర పాత్ర యువతను భలేగా ఆకట్టుకుంది. పాటల్లో సోనాలీ అందాన్ని కృష్ణవంశీ చిత్రీకరించిన తీరు సినీజనాన్నీ మురిపించింది. దాంతో చిరంజీవి ‘ఇంద్ర’ లోనూ సోనాలీ అందం మెరిసింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన సోనాలీ చిందేసిన తీరు కూడా ఆకట్టుకుంది. ఆపై మరోమారు కృష్ణవంశీ తన ‘ఖడ్గం’లో సోనాలీ బింద్రేను ఓ ప్రత్యేక పాత్రలో నటింప చేశారు. అందులోనూ పాటల్లో సోనాలీ సొగసు పరవశింప చేసింది. ఇక నాగార్జున సరసన నాయికగా నటించిన ‘మన్మథుడు’ లో సోనాలీ సోయగాలు మరింతగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ సరసన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’లో సోనాలీ ఓ నాయికగా నటించారు. మరోమారు చిరంజీవితో ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్.’ లో జోడీకట్టి ఢీడిక్కిలాడించింది సోనాలీ సోయగం.
దర్శకనిర్మాత, రచయిత గోల్డీ బెహెల్ ను పెళ్ళాడారు బింద్రే. వారికి ఓ అబ్బాయి. పేరు రణవీర్. అందంగా, ఆనందంగా సాగుతున్న సోనాలీ జీవితంలో కేన్సర్ కల్లోలం రేపింది. ధైర్యంగా ఆ వ్యాధిని జయించారు. ఇప్పటికీ సోనాలీ బింద్రే పేరు వినగానే ఆ నాటి ఆమె నాజూకు సోకులే మన మదిలో మెదలుతాయి. నటిగా ఎందరికో స్ఫూర్తి కలిగించిన సోనాలీ, వ్యక్తిగానూ పలువురిలో ధైర్యం నింపారు. ఆమె మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.