కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తెలుగులో చాలా రేర్. ఓ కథ అనుకుని, అన్ని వర్గాలను అలరించే అంశాలను ఏదో రకంగా అందులో మిళితం చేసి, వండి వార్చే సినిమాలే మనకు ఎక్కువ. అయితే శనివారం విడుదలైన ‘స్కైలాబ్’ మూవీ అందుకు భిన్నమైంది. మనం రెగ్యులర్ సినిమాల్లో చూసే హీరోహీరోయిన్ల లవ్ మేకింగ్ సీన్స్, సాంగ్స్, యాక్షన్, పిచ్చి కామెడీ, వెకిలి చేష్టలు ఇందులో కనిపించవు. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్ టైన్ మెంట్ వేలో చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ విశ్వక్ ఖండేరావ్.
ఇది 1979కి చెందిన కథ ఇది. తెలంగాణాలోని బండ లింగంపల్లి అనే గ్రామానికి చెందిన దొర (నారాయణరావు) బిడ్డ గౌరీ (నిత్యా మీనన్). హైదరాబాద్ లో ప్రతిబింబం అనే వార పత్రికలో పని చేస్తుంటుంది. తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఊరు చేరుతుంది. అదే గ్రామంలో ఉన్న తాతయ్య సదాశివం (భరణి)ని ఏదో రకంగా ఒప్పించి, ఓ ఐదు వేలు తీసుకుని, తన డాక్టర్ సర్టిఫికెట్ ను విడిపించుకోవాలని పల్లెకు బయలుదేరతాడు డాక్టర్ ఆనంద్ (సత్యదేవ్). ఇక ఆ పల్లెకే చెందిన సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ)ది చిత్రమైన గాథ. తాతయ్య నుండి సంక్రమించిన ఆస్తులు కోర్టు గొడవల్లో ఉంటాయి. జీవనాన్ని సాగించడం కోసం ఊరంతా అప్పులు చేసేస్తాడు. ఉద్యోగం చేసి వాటిని తీరుద్దామంటే సుబేదార్ అనే పదం అతన్ని ఆ పని చేయనీయదు. పాత్రికేయురాలిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకునే గౌరి; ఊరిలో హాస్పిటల్ పెట్టి తమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే ఆనంద్; అతనికి పెట్టుబడి పెట్టి, అప్పుల్లోంచి బయటపడాలనుకునే సుబేదార్ రామారావు జీవితాలు ఆ ఊరి మీద స్కైలాబ్ పడబోతున్న వార్త తెలిసిన తర్వాత ఎలా మారాయన్నదే ఈ చిత్ర కథ.
నాసా నిర్మించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ ప్రయోగం విఫలమై, దాని శకలాలు 1979లో జులై 11న హిందూ మహా సముద్రం, పశ్చిమ ఆస్ట్రేలియాలోనూ పడ్డాయి. అయితే స్కైలాబ్ శకలాలు ఈ భూమి మీద ఎక్కడైనా పడొచ్చునని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఓ భయానక వాతావరణం నెలకొంది. కొన్ని రోజుల పాటు ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఆనాటి సంఘటనలను ఓ కథగా అల్లుకుని, ముగ్గురు వ్యక్తుల జీవితాలకు దాన్ని ముడిపెడుతూ తెలంగాణ పల్లెపై స్కైలాబ్ పతనం ప్రభావం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విశ్వక్. స్కైలాబ్ భూమి మీద పడబోతోందనే వార్త తెలియగానే ఎలాగూ మరి కొద్ది రోజుల్లో చనిపోతాం కదాని కొందరు విపరీతంగా జల్సా చేశారు. మరికొందరు ఇక జీవితంలో మందు తాగే ఆస్కారం ఉండదని దేవదాసులైపోయారు. ఇంకొందరు భయస్తులు పూజలు, పునస్కారాలలో మునిగిపోయారు. ఇలా మనిషికో రీతిన ప్రవర్తించారు. ఈ సినిమాలోనూ ఆ తరహా పాత్రలు మనకు కనిపిస్తాయి. మిద్దె దిగి రాని దొర గారు స్కైలాబ్ కు భయపడి దిగుడు బావిలోకి చేరితే, ఆయన దగ్గర పనిచేసే వారు దొరగారి పట్టు పరుపులపై పవళిస్తారు. దేవాలయం గడపతొక్కని అట్టడుగు వర్గాల వారు స్కైలాబ్ పుణ్యమాని గుడిలోకి అడుగుపెడతారు. రేపు ఏం జరుగుతుందో తెలియక జనం కోట్ల రూపాయల పాలసీలు తీసుకుంటారు. భయం నుండి బయటపడటానికి కొందరు హోమాలు మొదలు పెడితే, మరికొందరు ధైర్యం కోల్పోయి హాస్పిటల్ బారిన పడతారు. ఈ మొత్తం తతంగంలో జీవితం అంటే ఏమిటో తెలుసుకునే ఆస్కారం ఇందులోని ప్రధాన పాత్రధారులు గౌరి, ఆనంద్, రామారావుకు లభిస్తుంది. స్కైలాబ్ పతనం నేపథ్యంలో గౌరి రాసిన కథనం ‘ప్రతిబింబం’లో కవర్ స్టోరీ కాగా, స్వార్థాన్ని వదిలిన తర్వాత ఆనంద్ ను వైద్యుడిగా ఊరంతా గుర్తిస్తుంది. ఇక సుబేదార్ రామారావు కష్టాలూ తీరిపోతాయి. ఇలా స్కైలాబ్ కారణంగా ఓ గ్రామంలో జరిగిన వింతలు, విశేషాలను వినోదాత్మకంగా సందేశాన్ని మిళితం చేసి అందించాడు డైరెక్టర్ విశ్వక్.
నటీనటుల విషయానికి వస్తే జర్నలిస్ట్ గౌరి పాత్రలో నిత్య మీనన్ చక్కగా ఒదిగిపోయింది. నాలుగు దశాబ్దాల కాలం నాటి వేషధారణ ఆమెకు చక్కగా సూట్ అయ్యింది. అంతే కాదు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు ఆమె నిర్మాణ భాగస్వామి కూడా. సత్యదేవ్ పోషించిన డాక్టర్ ఆనంద్ క్యారెక్టర్ పెసిమిస్టిక్ మెంటాలిటీతో మొదలై ప్యూరిటీతో ముగుస్తుంది. సినిమా కష్టాలన్నీ భుజానికి ఎత్తుకున్న సుబేదార్ రామారావు పాత్రలో రాహుల్ రామకృష్ణ తన ప్రతిభను కనబరిచాడు. గౌరి సహాయకుడిగా విష్ణు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆమె తల్లిగా తులసి వినోదాన్ని పంచింది. గౌరి తండ్రిగా నారాయణరావు, ఆనంద్ తండ్రిగా అరిపిరాల సత్య ప్రసాద్, తాతగా భరణి నటించారు. గౌరి చిన్నప్పటి ఉపాధ్యాయుడి పాత్రను సుబ్బరాయ శర్మ పోషించారు. తరుణ్ భాస్కర్ సైతం అతిథి పాత్రలో మెరిశాడు. ఇందులో చాలామంది కొత్త నటీనటులు కీలక పాత్రలను సమర్థవంతంగా పోషించారు.
‘స్కైలాబ్’ మూవీకి ప్రధాన బలం సంభాషణలు. తెలంగాణ యాసతో సాగే ఈ సినిమాను సింక్ సౌండ్ తో తీయడం కాస్తంత రిస్కే అయినా నటీనటుల ప్రతిభ కారణంగా సంభాషణలలోని మట్టి వాసనను థియేటర్లో ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. ప్రశాంత్ విహారి స్వరపరిచిన పాటల్లో మొదటిది చాలా బాగుంది. మిగిలినవి ఫర్వాలేదు. అయితే అతను అందించిన నేపథ్య సంగీతం మూవీకి మెయిన్ హైలైట్. ఆదిత్య జవ్వాది కెమెరా పనితనం వండర్ ఫుల్. దర్శకుడు విశ్వక్ కు ఇదే తొలి చిత్రం కావడంతో ఎమోషన్స్ ను సరిగా తెరకెక్కించలేకపోయాడు. ప్రథమార్ధం మొత్తం పాత్రల పరిచయంతో సాగిపోగా, ద్వితీయార్థంలోనే స్కైలాబ్ తతంగం మొదలవుతుంది. ముగింపు ఊహకు అందేదే అయినా, దాన్ని ఇంకాస్తంత ఆకట్టుకునేలా తీయాల్సింది. స్లో నెరేషన్ సైతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేదిగా ఉంది. రొటీన్ ఫార్మాట్ లో కాకుండా కాస్తంత భిన్నంగా ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించాలనుకున్న దర్శకుడు విశ్వక్, నిర్మాత పృథ్వీ పిన్నమరాజును అభినందించాలి. అయితే స్కైలాబ్ గురించి ఈ జనరేషన్ లో చాలా మందికి తెలియదు. అప్పటి సంఘటనలను ఇప్పటి వారికి గుర్తు చేయడంలోనూ పెద్దంత ఉపయోగంలేదు. ఆ కథాంశాన్ని ఇప్పుడు చెప్పడం అంటే ఇప్పటి కరోనా మీద పాతికేళ్ళ తర్వాత సినిమా తీసినట్లన్నమాట! సో… దిస్ ఈజ్ టూ లేట్!
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
నటీనటుల నటన
ఆకట్టుకునే సంభాషణలు
ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
ఊహకందే క్లయిమాక్స్
పండని ఎమోషన్స్
స్లో నెరేషన్
రేటింగ్: 2.5 / 5
ట్యాగ్ లైన్: టూ లేట్!