కొర్లిపర బాలగంగాధర తిలక్ అంటే ఎవరికీ అంతగా తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే ఆ నాటి ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన అభిరుచికి తగ్గ చిత్రాలను తమ అనుపమ ఫిలిమ్స్ పతాకంపై రూపొందించి దర్శకనిర్మాతగా అలరించారు కె.బి.తిలక్. ఆ రోజుల్లోనే రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ తిలక్ ‘ఎమ్.ఎల్.ఏ.’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం విశేషాదరణ చూరగొంది. 1939లో గూడవల్లి రామబ్రహ్మం తెరకెక్కించిన ‘రైతుబిడ్డ’, 1954లో కేవీ రెడ్డి రూపొందించిన ‘పెద్దమనుషులు’ తరువాత ఆ స్థాయి చిత్రంగా 1957 సెప్టెంబర్ 19న విడుదలైన ‘ఎమ్.ఎల్.ఏ.’ నిలచింది.
‘ఎమ్.ఎల్.ఏ’ సినిమా కథ ఏమిటంటే- ఓ ఊరిలో రైతు సేవా సమాజం ఉంటుంది. అందులో రైతు సేవాసంఘ నాయకుడు భూషయ్య, ఆయన కూతురు నిర్మల పనిచేస్తుంటారు. అదే ఊరిలో రాజకీయ నాయకుడు దామోదరం తన పని జరుపుకోవడం కోసం డబ్బును ఎరవేస్తూ ఉంటాడు. ఆ ఊరిలో నిజాయితీగల దాసు ప్రభుత్వోద్యోగి. ఓ సారి దామోదరం కోరిక మేరకు దాసు తన మనసు అంగీకరించక పోయినా ఓ పనిని అడ్డదారిలో చేసిపెడతాడు. అందుకు సంబంధించిన ఉత్తరాన్ని దామోదరం తన వద్ద పదిలంగా దాచుకుంటాడు. జమీందార్ పాపయ్య ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటాడు. అయితే దామోదరం తన మద్దతుతో దాసును పోటీకి నిలబెడతాడు. దాసుకు ఉన్న మంచి పేరు, దానికి తోడు దామోదరం బలం చూసి పాపయ్య కూడా ఎన్నికల నుంచి తప్పుకొని దాసుకే మద్దతు పలుకుతాడు. దాసు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాడు.
దాసు నిజాయితీ నిర్మలకు నచ్చుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. దాసు స్నేహితుడు రమేశ్, దాసు చెల్లెలు కమలను ప్రేమిస్తాడు. దామోదరం మేనకోడలు లీల కూడా రమేశ్ ను ప్రేమిస్తుంది. కానీ, అతను ఆమెను లెక్క చేయడు. శాసనసభలో దాసు భూసంస్కరణల బిల్లును ప్రతిపాదిస్తాడు. ఆ బిల్లు వస్తే తన ఆస్తులు కోల్పోవలసి వస్తుందని దామోదరం భావిస్తాడు. ఆ బిల్లును తీసుకు వచ్చే ప్రయత్నం విరమించమంటాడు దామోదరం. లేకపోతే, తన కోసం ఒకప్పుడు చేసిన తప్పుకు తగిన ఆధారం తన వద్ద ఉందని హెచ్చరిస్తాడు దామోదరం. దాంతో దాసు వెనక్కి తగ్గుతాడు. భర్త అలా వెనక్కి తగ్గడంతో నిర్మలకు దాసుపై అనుమానం వస్తుంది. భర్తలో నిజాయితీ లేదని నిర్మల అతనికి దూరమవుతుంది. దాసు ఏమీ చెప్పలేక సతమతమవుతాడు. ఈ నేపథ్యంలో దాసును దోషిగా నిలిపే ఆ ఉత్తరాన్ని దామోదరం మేనకోడలు లీల ద్వారా చాకచక్యంగా సంపాదిస్తాడు రమేశ్. ఆ ఉత్తరం చేతికి చిక్కగానే దాసు అసెంబ్లీలో ‘లాండ్ సీలింగ్’ బిల్లు పెడతాడు. అది ఆమోదం పొందడంతో జనం ఆనందిస్తారు. నిర్మలకు అసలు విషయం తెలిసి సంతోషిస్తుంది. రమేశ్, కమల పెళ్ళి జరిపిస్తారు దాసు, నిర్మల. దామోదరం ఆటలకు అడ్డుకట్ట పడడంతో కథ ముగుస్తుంది.
Read Also: National Cinema Day : ‘సినిమా డే’ 16 నుంచి 23కు వాయిదా( కొందరికి ఖేదం.. మరి కొందరికి మోదం)
ఈ చిత్రంలో దాసుగా జగ్గయ్య, నిర్మలగా సావిత్రి, రమేశ్ గా రమణమూర్తి, కమలగా గిరిజ, దామోదరంగా గుమ్మడి, లీలగా సూర్యకళ, పాపయ్యగా నాగభూషణం నటించారు. రమణారెడ్డి, పెరుమాళ్ళు, ఖుర్షీద్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి తాపీ ధర్మారావుతో కలసి ఆరుద్ర కథను రూపొందించారు. ఆరుద్ర, కోగంటి గోపాలకృష్ణయ్య రాసిన పాటలకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఇందులోని “నీ ఆశా అడియాశా నీ దారే మణిపూస… బ్రతుకంతా అమవాస లంబాడోళ్ళ రామదాసా…” పాట ఆ రోజుల్లో విశేషంగా మారుమోగింది. అలాగే ఆరుద్ర రాసిన “ఇదేనండి ఇదేనండి భాగ్యనగరమూ…” పాట కూడా జనాన్ని భలేగా ఆకట్టుకుంది. “సరసులు చతురులు సాహసవంతులు…”, “కోటలో నీ సీతెక్కడున్నది…”, “లోగుట్టు తెలుసుకో బాబయ్యా…”, “మాతృదేశమునకు పరీక్ష దినమిది…”, “జామిచెట్టు మీదనున్న…”, “నమో నమో బాపూ…” అంటూ సాగే పాటలు సైతం మురిపించాయి.
ఈ ‘ఎమ్.ఎల్.ఏ.’ చిత్రంతోనే రమణమూర్తి సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ప్రఖ్యాత గాయని ఎస్.జానకి తొలుత తెలుగు పాట పాడిందీ ఈ చిత్రంలోనే. ఈ సినిమాలో జగ్గయ్య పార్టీ గుర్తుగా ఆవు-దూడను చూపించారు. తరువాతి రోజుల్లో ఇందిరాగాంధీ 1971 ఎన్నికల్లో తమ పార్టీ చిహ్నంగా ‘ఆవు-దూడ’ను ఎన్నుకోవడం విశేషం! ఇందులో ఎమ్మెల్యేగా నటించిన జగ్గయ్య 1967 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడం మరింత విశేషం! అప్పట్లో ఎమ్.పి. అయిన ఎమ్.ఎల్.ఏ అంటూ జగ్గయ్యను పత్రికలు కీర్తించాయి.
ఈ చిత్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి ప్రత్యేకంగా ప్రదర్శించగా, ఆయనతో పాటు తరువాతి రోజుల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావు వంటివారు కూడా ఈ చిత్రాన్ని చూసి అభినందించారు. ‘ఎమ్.ఎల్.ఏ.’ సినిమా విజయం సాధించి, కె.బి.తిలక్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమాకు ముందు కె.బి.తిలక్ ‘ముద్దుబిడ్డ’ అనే సినిమాను రూపొందించారు. అందులోనూ జగ్గయ్యనే కథానాయకుడు. ఇది తిలక్ కు దర్శకనిర్మాతగా రెండో చిత్రం. ఈ సినిమా తరువాత కూడా జగ్గయ్యతోనే “అత్తా ఒకింటి కోడలే, చిట్టి తమ్ముడు, ఈడు-జోడు, ఉయ్యాల జంపాల” వంటి చిత్రాలు రూపొందించారు తిలక్. రష్యాకు ఈ సినిమా ప్రింట్ ను పంపారు తిలక్. ఆ సినిమాకు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ను శ్రీశ్రీ రాయడం విశేషం.