ముప్పై సంవత్సరాల వయసులో చేంబోలు సీతారామశాస్త్రి… ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అయ్యారు. ఆ తర్వాత ముప్పై వసంతాలకు ‘పద్మశ్రీ’ సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారు. గత యేడాది నవంబర్ 30న కన్నుమూసే వరకూ ఆయన పాటతోనే ప్రయాణించారు. పాటనే పలవరించారు. తెలుగు సినిమా పాటకు సాహితీ గౌరవాన్ని కలిగించిన సీతారామశాస్త్రి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో అభిమానం. మే 20 ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పుట్టిన రోజు. ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో తానా ప్రపంచ సాహిత్య వేదిక సీతారామశాస్త్రి జయంతి ఉత్సవాన్ని మే 20న ఘనంగా జరుపబోతోంది. ఆయన సమగ్ర సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకురానుంది. సినీ గీతాలను నాలుగు సంపుటాలుగా, ఇతర సాహిత్యాన్ని రెండు సంపుటాలుగా ప్రచురిస్తున్నారు.
ఈ బృహత్ కార్యక్రమాన్ని నవంబర్ 30 తేదీలోగా పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉంది. ఇందులో తొలి సంపుటాన్ని భారత ఉపరాష్ట్రపతి, గౌరవనీయులు ఎం. వెంకయ్యనాయుడు మే 20వ తేదీ సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించబోతున్నారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా పాల్గొనే ఈ వేడుకలో పద్మశ్రీ గరికపాటి నరసింహారావు పుస్తక పరిచయం చేస్తారు. స్వర్గీయ సీతారామశాస్త్రి సినీ సహచరులు కృష్ణవంశీ, క్రిష్, భరణి, కీరవాణి, ఆర్పీ పట్నాయక్, తమన్, భువనచంద్ర, జొన్నవిత్తుల, చంద్రబోస్, అశోక్ తేజ, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొనబోతున్నారు.