హీరో సిద్దార్థ్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. మొదటి నుంచి సిద్దార్థ్ ఏ విషయమైనా నిస్సంకోచంగా తన మనుసులో ఉన్న మాటను చెప్పే స్వభావం కలవాడు. సామాజిక అంశాల మీద.. ప్రభుత్వ విధానాలు వైఫల్యాల మీద.. సినీ ఇండస్ట్రీ గురించి తనదైన రీతిలో ట్విట్టర్ లో ఏకిపారేస్తాడు. ఇక ఇటీవల సమంత- నాగ చైతన్య విడాకుల సమయంలో సిద్దు వేసిన ట్వీట్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్ ఒకరిమీద వేసింది కాదు అని సిద్దు సర్దిచెప్పినా అందరు అది సామ్ కోసమే అని తేల్చిచెప్పారు. ఇక తాజాగా సిద్దార్థ్ పాన్ ఇండియా మోసం అంటూ మరో వివాదానికి తెరలేపాడు. “ప్రస్తుతం సినిమాల కలెక్షన్ రిపోర్టులను ఫడ్జింగ్ చేయడానికి కమీషన్ లేదా రేటు ఎంత? నిర్మాతలు చాలా కాలంగా బాక్సాఫీస్ లెక్కల గురించి అబద్ధాలు చెబుతున్నారు.. ఇప్పుడు “వాణిజ్యం” మరియు “మీడియా” వారి “అధికారిక” గణాంకాలను చెప్పడం ప్రారంభించాయి.. అన్ని భాషలు అన్ని పరిశ్రమలు ఒకేలా ఉన్నాయి. పాన్ ఇండియా మోసం” అని ట్వీట్ చేశాడు.
ఆ తరువాత కొద్దిసేపటికి “నా జీవితంలో నేను చూసి ప్రభావితమైన చిత్రాలలో ఒకదానిని క్యాష్ గ్రాబ్ రీబూట్ చేయాలనీ చూస్తున్నారు… ప్రియమైన ఫిల్మ్ మేకర్స్, దయచేసి మా కౌమార జ్ఞాపకాలను వదిలివేయండి. ఒరిజినల్ ఏమైనా ఉంటే దానిని సృష్టించండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ గా మారాయి. సిద్దార్థ్ తన ట్వీట్ లో ఏ సినిమాని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. సిద్దార్థ్ ఎవరి గురించి, ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాడు అనేదానిమీద నెట్టింట్లో రచ్చ జరుగుతుంది. పలువురు అభిమానులు మీ హీరో సినిమా అంటే మీ హీరో సినిమా అని రచ్చ జరుపుతున్నారు. ఇక ఈ ట్వీట్లపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. సిద్దార్థ్ కి చేతిలో సినిమాలు లేక, అందరి అటెన్షన్ కోసమే ఇలాంటి కాంట్రవర్సీ ట్వీట్లు వేస్తున్నాడని అంటున్నారు. మరి నిజంగా సిద్దు అటెన్షన్ కోసమే వేశాడా..? లేక నిజంగానే పాన్ ఇండియా రికార్డులు మోసమా ..? అనేది తెలియాలని మరికొంతమంది తెలుపుతున్నారు.