Shyamala Devi Comments on Kalki 2898 AD: జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ సత్తా చాటుతోంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ఈ చిత్రం.. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి రాకతో కళకళలాడుతున్నాయి. వరుసగా సలార్, కల్కి హిట్ అవ్వడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవద్దుల్లేకుండా పొయాయి. అయితే కల్కి సినిమాపై ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
40 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు కల్కి సినిమాను స్టార్ట్ చేశారని శ్యామలా దేవి తెలిపారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్యామలా దేవి మాట్లాడుతూ… ‘కృష్ణం రాజు గారు కల్కి అనే పేరు పెట్టి ఓ సినిమా స్టార్ట్ చేశారు. దాదాపుగా 40 ఏళ్ల క్రితం మొదలెట్టారు. కొన్ని షూట్ చేసిన సీన్స్ కూడా కొన్ని ఇంట్లో ఉన్నాయి. ఆ సినిమాకు ఎంఎం కీరవాణి గారు ఓ సాంగ్ కూడా చేశారట. ఇప్పటికీ ఆ సాంగ్ కీరవాణి దేవుడి ఇంట్లో ఉంటుంది. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. అనుకోకుండా ఇప్పుడు ఆ పేరుతో సినిమా వచ్చింది’ అని చెప్పారు.
Also Read: Kalki 2898 AD Collections: బాక్సాఫీస్ వద్ద ‘కల్కి’ ప్రభంజనం.. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిక!
కృష్ణం రాజు, ప్రభాస్ ఇద్దరూ ఫలితాన్ని ఆశించి ఏదీ చేయరని శ్యామలా దేవి తెలిపారు. ‘కృష్ణం రాజు, ప్రభాస్ ఇద్దరూ ఎదుటువారికి చాలా మర్యాద ఇస్తారన్నారు. అతిథులకు అన్ని రకాల వంటలు ఇంట్లోనే స్వయంగా చేయిస్తారు. కృష్ణం రాజు గారు స్వయంగా రుచి చూస్తారు. కృష్ణం రాజు ఏం తింటారో చిత్ర యూనిట్‌కు మొత్తం అదే భోజనం ఉంటుంది. వీఐపీ, లైట్ మ్యాన్ అంటూ తేడా ఉండదు. ప్రకాష్ రాజ్ గారికి రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు.