Shruti Haasan: శ్రుతి హాసన్ పేరు వినగానే ఆమె విలక్షణమైన వ్యక్తిత్వమూ, వైవిధ్యమైన చలనచిత్ర జీవితమూ గుర్తుకు వస్తాయి. తన తండ్రి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ – వారిద్దరి సరసన ఒకేసారి నాయికగా నటించేసి, ఇద్దరితోనూ బంపర్ హిట్స్ అందుకొని తనదైన బాణీ పలికించింది శ్రుతిహాసన్. ఒకప్పుడు ‘ఐరన్ లెగ్’ అన్నవారే తరువాత ‘గోల్డెన్ లెగ్’ అంటూ శ్రుతి హాసన్ కు ఎర్రతివాచీ పరచి మరీ జేజేలు పలుకుతున్నారు. ఆహా… ఇది కదా విజయమంటే! అంతటి సక్సెస్ ను సొంతం చేసుకున్న శ్రుతిహాసన్ నేడు టాప్ స్టార్స్ ఛాయిస్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకునిగా తెరకెక్కుతోన్న ‘సలార్’లో నాయికగా నటిస్తున్నారు శ్రుతి హాసన్. ‘ది ఐ’ అనే ఆంగ్ల చిత్రంలోనూ శ్రుతి ముఖ్యభూమిక పోషిస్తున్నారు.
అసలు శ్రుతిహాసన్ కెరీరే చిత్రవిచిత్రంగా సాగిందని చెప్పవచ్చు. ఆరంభంలో ఆమెను ఫ్లాపులు పలకరించాయి. ఆ పై ‘గబ్బర్ సింగ్’తో అబ్బో అనిపించే విజయాన్ని అందుకున్నారామె. ‘గబ్బర్ సింగ్’కు ముందు ఆ చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ కు, డైరెక్టర్ హారీశ్ శంకర్ కు, శ్రుతి హాసన్ కు సక్సెస్ లేదు. విచిత్రంగా ఆ సినిమాలో అన్ని మైనస్సులూ కలసి ఓ బిగ్ ప్లస్ గా మారి ‘గబ్బర్ సింగ్’ పెద్ద హిట్టయింది. తరువాత మెగా ఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్ తో ‘రేసుగుర్రం’, రామ్ చరణ్ తో ‘ఎవడు’ వంటి హిట్స్ పట్టేశారు శ్రుతి. రవితేజతో ‘బలుపు’, ‘క్రాక్’ వంటి చిత్రాలతోనూ, మహేశ్ బాబుతో ‘శ్రీమంతుడు’తోనూ మరిన్ని విజయాలను తన కిట్ లో వేసుకున్నారామె.
తండ్రి కమల్ హాసన్ లాగే శ్రుతి హాసన్ సైతం తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించుకుంటూ సాగారు. తన తండ్రి ‘ఈనాడు’ సినిమాకు ప్రచార గీతంలో గళం విప్పిన శ్రుతి ఆ తరువాత “ఓ మై ఫ్రెండ్, త్రీ, రేసుగుర్రం, ఆగడు” చిత్రాల్లోనూ తెలుగు పాటలు పాడి అలరించారు. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కు కంపోజర్ గానూ పనిచేశారు. ఇలా బహుముఖ ప్రజ్ఞతో సాగిన శ్రుతి హాసన్ సినిమా కెరీర్ లోనే కాదు, ఆమె రియల్ లైఫ్ లోనూ పలు మలుపులు ఉన్నాయి. అప్పట్లో హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం సాగించింది. తరువాత మైఖేల్ కోర్సేల్ అనే విదేశీ నటునితోనూ ప్రేమయాత్రలు చేసింది. అతనితో తెగతెంపులు చేసుకున్నానని ఆ మధ్య ప్రకటించింది. డూడుల్ ఆర్టిస్ట్ శంతనూ హజారికాతో సహజీవనం చేస్తున్నట్టు తెలిపింది.
ఏది ఏమైనా శ్రుతి హాసన్ కన్నవారు కమల్ హాసన్, సారిక కంటే భిన్నంగా తన కెరీర్ ను మలచుకున్నారు. అలాగే విలక్షణమైన వ్యక్తిత్వంతో సాగుతున్నారు. నవతరానికి అసలు సిసలు ప్రతీకగా కనిపించే శ్రుతిహాసన్ మునుముందు ఏ తీరున అలరిస్తారో చూడాలని ఆమె అభిమానులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.