యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ ఇప్పుడు యాంగ్రీ స్టార్ గా మారారు. ఆయన హీరోగా నటించిన ‘శేఖర్’ చిత్రాన్ని జీవిత దర్శకత్వంలో శివానీ, శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాసరావు, వంకాయలపాటి మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రాజశేఖర్ తో పాటు ఆయన పెద్ద కూతురు శివానీ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ నెల 20న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో మూవీ ట్రైలర్ ను గురువారం ఏఎంబీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యంగ్ హీరో అడివి శేష్ హాజరయ్యారు. అలానే యువ దర్శకుడు పవన్ సాదినేని, నటి ఈషా రెబ్బ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ, ”రాజశేఖర్ గారి సినిమాల్లో నా ఆల్ టైమ్ ఫేవరేట్ ‘మగాడు’. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. నిజానికి ఆయనతో కంటే జీవిత గారితోనే నాకు పరిచయం ఎక్కువ. చాలా మంది ప్రతి మగాడి విజయం వెనుక ఆడవారు ఉంటారని అంటారు. కానీ వారి పక్కనే ఉండి ముందుకు నడిపించే మహిళలు ఇవాళ ఉన్నారు. జీవిత అలాంటి వ్యక్తి. ఆమె దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రాజశేఖర్ గారి పేరులోని ‘శేఖర్’ను ఈ సినిమాకు జీవిత వాడేశారు. నా పేరులోని ‘శేషు’తోనూ ఆవిడ ఇప్పటికే సినిమా చేసేశారు” అని చమత్కరించాడు. ఈ సినిమాను తాము చూశామని చాలా చాలా బాగుందని నటి ఈషారెబ్బ, పవన్ సాదినేని చెప్పారు. ‘శేఖర్’ లాంటి మంచి సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నాడు. ఈ సినిమా హక్కులు పొందడం సంతోషంగా ఉందన్నారు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ముత్యాల రాందాసు. ఇందులో జడ్జి పాత్రలో నటించానని, మలయాళ ‘జోసఫ్’కు రీమేక్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు.
హీరో రాజశేఖర్ మాట్లాడుతూ, ”మాది సినిమా కుటుంబం. సినిమానే మా ప్రపంచం. కరోనా కారణంగా ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయాం. ఈ యేడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. పరిస్థితులు సహకరించకపోవడం, వేరే సినిమాలు ఉండటంతో మే 20న రిలీజ్ చేస్తున్నాం. సో… మాకు మే 20వ తేదీనే సంక్రాంతి. ఈ సినిమా మొదటి ఆట చూసి, నచ్చితే ఇతరులకు చెప్పాల్సిందిగా ప్రేక్షకులను కోరుతున్నాను. ఈ సినిమాను వారు ఆదరిస్తారనే విశ్వాసం నాకుంది” అని అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, ”సినిమాను నమ్ముకుని ఉన్న వ్యక్తులం మేం. ఇక్కడే సంపాదించాం, ఇక్కడే పోగొట్టుకున్నాం. చాలామంది ‘ ‘శేషు’ తర్వాత పూర్తి స్థాయిలో ఎందుకు దర్శకత్వం వహించలేదు?’ అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నిజానికి మహిళలలోని ప్రతిభను పాజిటివ్ గా తీసుకుని ప్రోత్సహించే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. నా వరకూ నేను ఎవరి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ‘శేఖర్’ మూవీ చాలా బాగా వచ్చింది. ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు నా ధన్యవాదాలు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రవివర్మ కూడా పాల్గొన్నారు.