sekhar Kammula:సినిమాకు ఓ గ్రామర్ కూర్చిన మహామహులు సైతం ‘హ్యూమానిటీ స్టాండ్స్ అబౌ ఆల్” అని పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల ఆ సూత్రాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ప్రేక్షకులను కట్టిపడేసే మానవీయ విలువలను తన కథల్లో చొప్పించడం శేఖర్ బాణీ. తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’ మొదలు మొన్నటి ‘లవ్ స్టోరీ’ దాకా ఆయన సినిమాలను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. విలువలకు ఏ నాడూ తిలోదకాలు ఇవ్వరు. శేఖర్ సినిమాలను చూస్తే విలువలే ఆయన అసలైన ఆస్తి అనిపిస్తుంది. ఇప్పటి దాకా అదే తీరున అలరించిన శేఖర్ మళ్ళీ ఏ సినిమాతో తమను పలకరిస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న ఏలూరులో జన్మించారు. అయితే పక్కా లోకల్ అన్నట్టుగా హైదరాబాదీలా ఉంటారు. చదువులో దిట్ట. అలాగే కళలన్నా శేఖర్ కు ప్రాణం. చదువును అశ్రద్ధ చేయకుండానే, సినిమాల్లో రాణించాలని కలలు కన్నారు శేఖర్. వాటి ఫలితంగానే ‘డాలర్ డ్రీమ్స్’ తెరకెక్కించారు. మొదటి సినిమాతోనే తొలి చిత్ర దర్శకునిగా జాతీయ అవార్డు పట్టేశారు శేఖర్. దాంతో ఒక్కసారిగా సినీజనం శేఖర్ వైపు చూశారు. తరువాత చిరంజీవి సినిమా ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్.’ విడుదల రోజునే తన ‘ఆనంద్’ చిత్రాన్ని విడుదల చేశారు శేఖర్. అప్పట్లో అందరూ శేఖర్ సాహసం చేస్తున్నాడని అన్నారు. కానీ, ఓ టాప్ స్టార్ మూవీ విడుదల రోజునే తమ చిన్న సినిమా విడుదలయితే, అగ్ర కథానాయకుని చిత్రానికి టిక్కెట్స్ దొరకని వారందరూ తమ సినిమాకు వస్తారు కదా అన్నది శేఖర్ లెక్క! అది తప్పలేదు. శేఖర్ చెప్పినట్టుగానే ‘ఆనంద్’ను చూసిన వారందరూ ‘ఓ మంచి కాఫీ లాంటి సినిమా’ అంటూ ఆదరించారు. ఆ తరువాత శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోదావరి’ కొందరిని మాత్రమే ఆకట్టుకోగలిగింది. అయితే ఈ రెండు చిత్రాలతోనూ ఉత్తమ దర్శకునిగా నందిని సొంతం చేసుకున్నారు శేఖర్. ఆ పై వచ్చిన శేఖర్ సినిమా ‘హ్యాపీ డేస్’ టైటిల్ కు తగ్గట్టుగానే ఎందరికో ఆనందమైన రోజులు చూపించింది. రానా హీరోగా నటించిన తొలి చిత్రం ‘లీడర్’ శేఖర్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ” చిత్రాలతో తనదైన మార్కు చూపిస్తూ ఆకట్టుకున్నారు శేఖర్.
నవతరం ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసే కథాంశాలతో శేఖర్ కమ్ముల చిత్రాలు ఉంటాయి. మన చుట్టూ, నిత్యం మనకు తారసపడే అంశాలతోనే శేఖర్ తన సినిమాలకు కథలు రూపొందిస్తూ ఉంటారు. అందుకే చూసేవారిని ఆయన కథలు ఇట్టే పట్టేస్తాయి. శేఖర్ సక్సెస్ రేటు బాగా ఉన్నా, ఆయన పరిగెత్తి పాలు తాగే రకం కాదు. నిలకడగా నిలబడి నీళ్ళు తాగినా అందులోనే సంతృప్తిని వెదుక్కుంటారు. అందుకే శేఖర్ ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య గ్యాప్ బాగా ఉంటుంది. అయినా, తన ప్రతి చిత్రంతో జనాన్ని ఆకర్షిస్తూ ఉండడమే శేఖర్ స్పెషాలిటీ.
ప్రస్తుతం అందరు దర్శకుల లక్ష్యం యువతను ఆకట్టుకోవడమే. శేఖర్ కథల్లో యువతను ఆకర్షించే అంశాలు బోలెడు ఉంటాయి. అలాగని అతను ఏ నాడూ అశ్లీలానికి, అసభ్యతకు తావిచ్చింది లేదు. శేఖర్ సినిమాలను నిరభ్యంతరంగా సకుటుంబసమేతంగా చూడవచ్చునని ప్రేక్షకుల విశ్వాసం. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూనే శేఖర్ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు. ధనుష్ హీరోగా ఓ త్రిభాషా చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో శేఖర్ ఉన్నారు. మరి అదెప్పుడు జనం ముందు నిలుస్తుందో చూడాలి.