సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద సైలెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్నీ) కార్యాలయంలో భారీ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో ఎంపీ కేశినేని చిన్నీ, నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు రామ అబ్బరాజు పాల్గొని కేక్ కట్ చేసి విజయాన్ని పంచుకున్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో, అదే టైటిల్‌తో వచ్చిన శర్వానంద్ సినిమా కూడా అదే మేజిక్‌ను రిపీట్ చేసిందని ఎంపీ ప్రశంసించారు. “భారీ పోటీ ఉన్నప్పటికీ, శర్వానంద్ సినిమా పక్కా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నా స్నేహితుడు అనిల్ సుంకర, మిత్రుడు శర్వానంద్ కష్టానికి దక్కిన ఫలితం ఇది.””చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బ్రహ్మాండమైన వసూళ్లు రాబట్టడం సంతోషంగా ఉంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది.” అని అన్నారు.
Also Read :Chiranjeevi: MSVG సినిమా చూసి విడాకులకి రెడీ అయిన జంట కలిసి పోయారు!
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ సినిమాకు పెరుగుతున్న ఆదరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. “మా సినిమాకు తక్కువ థియేటర్లు దొరికినప్పటికీ, ఆడిన ప్రతి చోటా షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్ చూస్తుంటే రోజురోజుకు థియేటర్ల సంఖ్య పెరిగేలా ఉంది. ఈ సినిమా చూస్తే వారం రోజుల పాటు ఆనందంగా ఉంటారు, తద్వారా ఆయుష్షు పెరుగుతుంది” అని ఆయన చమత్కరించారు. అలాగే సినిమా నిర్మాణంలో సహకరించిన ఎంపీ చిన్నీకి ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు బాగున్నాయి, మా సినిమా మరీ బాగుంది అంటున్నారని అన్నారు. దర్శకుడు రామ అబ్బరాజు విజయవాడతో ఉన్న సెంటిమెంట్‌ను పంచుకున్నారు. “విజయవాడ ఉత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నాకే చివరి షెడ్యూల్ పూర్తి చేశాం. అమ్మవారి ఆశీస్సులతో సినిమా పెద్ద హిట్ అయ్యింది. అందుకే మా విజయోత్సవాలను కూడా ఇంద్రకీలాద్రి పాదాల నుంచే ప్రారంభిస్తున్నాం” అని పేర్కొన్నారు.