మహానటి అన్న పదానికి నిలువెత్తు రూపం నటి శారద. ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటి అవార్డును ‘ఊర్వశి’ అవార్డుగా పిలిచేవారు. అలా ఆ అవార్డును రెండు సార్లు సొంతం చేసుకున్న ఏకైక నటీమణిగా శారద నిలిచారు. మూడో సారి కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి మొత్తం మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక దక్షిణాది నటిగానూ ఆమె కొనసాగుతున్నారు
శారద అసలు పేరు సరస్వతీదేవి. 1945 జూన్ 25న తెనాలిలో జన్మించారు శారద. చిన్నతనంలోనే సినిమా పాటలకు తగ్గ నృత్యం చేయడం, ఇతరులను అనుకరించడం చేసేవారు. దాంతో తెనాలి ప్రాంతానికే చెందిన మహానటీమణులు సావిత్రి, జమున అంతటి స్థాయికి చేరుకుంటుందని పెద్దలు దీవించేవారు. పదేళ్ళ ప్రాయంలోనే శారద తెరపై కనిపించి అలరించారు. యన్టీఆర్, సావిత్రి నటించిన ‘కన్యాశుల్కం’లో బాలనటిగా ఓ పాటలో కనిపించారు శారద. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించిన శారద ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడుమూతలు’ వంటి చిత్రాలలో పద్మనాభం జోడీగా నటించారు. శారద మాతృభాషలో కథానాయికగా మారడానికి కొంత సమయం తీసుకున్నారు. మళయాళ చిత్రసీమ మాత్రం శారదకు ఎర్రతివాచీ పరచి ఆహ్వానించిందనే చెప్పాలి. అక్కడే తనదైన అభినయంతో శారద మళయాళ వాసులను పరవశింపచేశారు. మళయాళ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలవగానే, మనవాళ్ళ చూపు సైతం శారదవైపు సాగింది. మళయాళంలో ఆమెను ‘ఊర్వశి’గా నిలిపిన ‘తులాభారం’ ఆధారంగా తెలుగులో తెరకెక్కిన ‘మనుషులు మారాలి’లోనూ శారద అభినయించారు. ఈ సినిమాతో తెలుగువారిని శారద విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత నుంచీ తెలుగు చిత్రాలలోనూ శారద అభినయం వెలుగులు విరజిమ్మింది. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సైడ్ హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకున్నారు. అయితే శోభన్ బాబుకు మాత్రం హిట్ పెయిర్ గా నిలిచారామె. వారిద్దరూ నటించిన “సిసింద్రీ చిట్టిబాబు, కాలం మారింది, మానవుడు-దానవుడు, శారద, దేవుడు చేసిన పెళ్ళి, జీవితం, ఇదాలోకం, బలిపీఠం, కార్తీక దీపం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త” వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి.
శారదకు తొలిసారి జాతీయ స్థాయిలో ‘ఊర్వశి’ అవార్డు 1968లో మళయాళ చిత్రం ‘తులాభారం’ ద్వారా లభించింది. ఆ తరువాత 1972లో ‘స్వయంవరం’ మళయాళ చిత్రం ద్వారా రెండోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు. ఎందువల్లో 1973 తరువాత నుంచీ ‘ఊర్వశి’ అన్న టైటిల్ ను తీసేసి, ‘బెస్ట్ యాక్ట్రెస్’గానే ఆ అవార్డును ప్రదానం చేస్తున్నారు. అలా కూడా 1978లో తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ ద్వారా జాతీయ ఉత్తమనటిగా నిలిచారు శారద. ఆ రోజుల్లో అందరూ ఆమెను ‘ఊర్వశి’ శారద అంటూనే పిలిచేవారు. సామాన్యులు సైతం శారదను తెరపై చూడగానే ‘మన ఊర్వశి’ అంటూ ఆరాధించేవారు. 1974లో శారద ప్రధాన పాత్రలో కె.బాపయ్య ‘ఊర్వశి’ అన్న చిత్రాన్నే రూపొందించారు. అలా ‘ఊర్వశి’ అవార్డుతో శారదలాగా పేరొందిన నటి మరొకరు కానరారు.
శారద అంటేనే శోకసముద్రం పొంగిపొరలుతుంది అనే పేరుండేది. ఎందుకంటే ఆమెకు ఊర్వశి అవార్డులు సంపాదించి పెట్టిన చిత్రాలన్నిటా అదే తీరున ఆమె అభినయం సాగింది. యన్టీఆర్ తో ‘జీవితచక్రం’లో సైడ్ హీరోయిన్ గా నటించిన శారద ఏ నాడూ ఆయన సరసన మెయిన్ హీరోయిన్ గా నటించలేకపోయారు. అలాంటి శారద తరువాతి రోజుల్లో ‘సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి’ చిత్రాల్లోనూ యన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ఓ పాత్రకు జోడీగా నటించారు. ‘దానవీరశూర కర్ణ’లో తొలిసారి యన్టీఆర్ దర్శకత్వంలో నటించిన శారద, ఆ తరువాత ‘చండశాసనుడు’లో ఆయన చెల్లెలిగా రౌద్రరస పాత్రలో కనిపించారు. ఆ సినిమా తరువాత శారద కెరీర్ మేలుమలుపు తిరిగింది. ఆపై అనేక చిత్రాలలో రౌద్రరస పాత్రలలో శారద తనదైన అభినయంతో అలరించారు. ఇలా సాగుతున్న శారద కెరీర్ ను యన్టీఆర్ సొంత చిత్రం ‘అనసూయమ్మగారి అల్లుడు’ మరో మలుపు తిప్పింది. ఆ సినిమాలో శారద కామెడీని భలేగా పండించారు. అప్పటి నుంచీ పలు చిత్రాలలో హాస్యంతోనూ శారద ఆకట్టుకోవడం విశేషం! చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలకు అక్కగా, వదినగా, తల్లిగా నటించిన శారద ఆ తరువాతి తరం హీరోలకు అమ్మమ్మగా, నాన్నమ్మగానూ నటించి మెప్పించారు.
యన్టీఆర్ ‘కన్యాశుల్కం’తో చిత్రసీమలో ప్రవేశించిన శారద, ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయరంగంలో అడుగు పెట్టడం విశేషం! టీడీపీ తరపున తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇలా శారద జీవితంలోని పలు మేలుమలుపుల్లో యన్టీఆర్ ఉన్నారని ఆమె పదే పదే చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఈ నాటికీ ఆ నాటి అభిమానులు శారద పేరు వినగానే ‘ఊర్వశి’ శారద అని గుర్తు చేసుకుంటారు. 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శారద, మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా జీవించాలని ఆశిద్దాం.