సూపర్ హీరో మూవీ ‘షాంగ్ – చి అండ్ లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ ను భారత్ తో సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు మార్వెల్ స్టూడియోస్ మరోసారి స్పష్టం చేసింది. షాంగ్-చి గా సిము లియు నటించిన ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. కెవిన్ ఫిగే, జోనాథన్ స్క్వార్జ్ దీన్ని ప్రొడ్యూస్ చేశారు. నిజానికి సినిమా విడుదల తేదీపై అప్ డేట్ ఇవ్వడం ఇది మొదటిసారి కాదు… గతంలోనే ఈ తేదీని ఖరారు చేశారు. సహజంగా ఇలాంటి విదేశీ చిత్రాలు ఆంగ్లంతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డబ్ అయ్యి ఇండియాలో విడుదల అవుతుంటాయి. కానీ చిత్రంగా ‘షాంగ్-చి అండ్ లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ మూవీని హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Read Also : బండ్ల గణేశ్ హీరోగా సినిమా! అక్కడ అభిషేక్ బచ్చన్… ఇక్కడ బండ్ల గణేశ్!
దాంతో తమిళనాడులోని ఈ సీరిస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళ భాషలో ఎందుకు ఈ మూవీని డబ్ చేయడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాము అభిమానించే సూపర్ హీరో మూవీ త్వరలోనే విడుదల కాబోతోందనే ఆనందాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నా, రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చినా… ఇంకా హిందీ డబ్బింగ్ ట్రైలర్ కూడా విడుదల చేయకపోవడంపై కొందరు కినుక వహిస్తున్నారు. మరి ఇండియా బాక్సాఫీస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అయినా ‘షాంగ్-చి’ నిర్మాతలు వెంటనే ప్రచారం జోరును పెంచుతారేమో చూడాలి.