చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఒకరి తరువాత ఒకరు.. తమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలుపుతూ అభిమానులకు షాకులు ఇస్తున్నారు. నాగ చైతన్య- సమంత, ధనుష్- ఐశ్వర్య, అమీర్ ఖాన్- కిరణ్ రావు, జానీ డెప్- అంబర్ ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి చేరింది బాలీవుడ్ టీవీ నటి సురభి తివారీ. 2019 లో పైలెట్ కమ్ వ్యాపారవేత్త ప్రవీణ్ ను వివాహమాడిన సురభి.. పెళ్ళైన దగ్గరనుంచి అత్తగారు వేధిస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా.. తన భర్త ముంబై వస్తాడని మాట ఇచ్చి, ఇప్పుడు మాట మారుస్తున్నాడని చెప్పుకొచ్చింది. సురభి బాలీవుడ్ లో టాప్ మోస్ట్ టీవీ నటి.. ఆమెకు ముంబై లో రోజూ షూటింగ్ ఉంటుంది. దీంతో నా షూటింగ్లు నిలిచిపోతున్నాయి. అవకాశాలు రావడం లేదు. ఇదే విషయమై ప్రవీణ్ తో ఎప్పుడు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.
తన అత్తగారు తనను వేధిస్తున్నారని, ప్రవీణ్ ను ముంబై పంపించడానికి ససేమిరా అంటున్నారని ఆరోపించింది. ఇక తన నుంచి తన బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అత్తింటివారు తీసేసుకున్నారని, వాటిని పొందడం తన హక్కని, వాటికోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పుకొచ్చింది. తన భవిష్యత్తు బావుండాలంటే తన భర్తకు విడాకులు ఇవ్వక తప్పడంలేదని చెప్పుకొచ్చింది. మ్యూచువల్ గా విడాకులు తీసుకోవాలనుకున్నా భర్త విడాకులకు ఒప్పుకోవడంలేదని, అందుకే లీగల్ గా వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ టీవీ రంగంలో కలకలం సృష్టిస్తోంది. షగున్ సీరియల్ తో సురభి మంచి గుర్తింపు తెచ్చుకొంది.