Shaakuntalam: స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా ఈ సినిమాను గుణ శేఖర్ తెరకెక్కించాడు. నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. తాజగా ఈ సినిమాలోని రెండో సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఋషివనంలోనా స్వర్గ ధామం.. హిమవనంలోనా అగ్ని వర్షం అంటూ సాగినా ఈ పాట హృదయాలను హత్తుకొంటుంది. ఋషివనంలో శకుంతలతో దుష్యంతుడు ప్రేమ పాఠాలు వల్లిస్తూ కనిపించాడు. ఇక శకుంతల మనసులోని భావాలను సాంగ్ లో తెలియజేశారు.
స్వయంవరానికి రాకుండానే కలల ప్రియుడు తన చెంతకు చేరాడు.. చిగురాకు లాంటి తన మదిని గెలిచాడు అని ప్రియడు గురించి చెప్పుకొస్తోంది శకుంతల. ఇక శ్రీమణి, చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ వారి ప్రేమ కావ్యాన్ని తెలియజేస్తున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ కు.. సెన్సేషనల్ సింగర్స్ సిద్ శ్రీరామ్, చిన్మయి వాయిస్ వీరి ప్రణయ కావ్యాన్ని ప్రేక్షకులకు దగ్గరచేస్తున్నాయి. ముఖ్యంగా వీడియోలో సామ్, దేవ్ మోహన్ ల కెమిస్ట్రీ అదిరిపోయింది. కళ్ళముందు శకుంతల, దుష్యంతులే ఉన్నట్లు కనిపించేలా వారి ఆహార్యం, హావభావాలు ఆకట్టుకొంటున్నాయి. మొత్తానికి సాంగ్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి ఈ సినిమాతో సామ్ మరో హిట్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.