సినిమా విడుదలైన తర్వాత కథ వేరు! కానీ మూవీ రిలీజ్ కు ముందే సంచలన విజయాన్ని అందుకొంది ‘లవ్ స్టోరీ’లోని సారంగ దరియా సాంగ్! రోజు రోజుకూ ఈ సాంగ్ లిరికల్ వీడియో వీక్షకుల సంఖ్య సోషల్ మీడియాలో పెరిగిపోతూ ఉంది. ఇప్పటి వరకూ దీనికి 300 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కాయి. ఓ లిరికల్ వీడియో అతి తక్కువ సమయంలో ఇంత ఆదరణ పొందడం అనేది సౌత్ లో ఇదే మొదటిసారి. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’లోని ఈ గీతం విడుదలై కాగానే ఇన్ స్టంట్ హిట్ అయిపోయింది. దానికి ఆ పాట వచ్చిన వివాదం అగ్నికి ఆజ్యం తోడైనట్టు అయ్యింది. ఆపైన శేఖర్ కమ్ముల చొరవతో వివాదం చల్లారినా… ఈ జానపద గీతం కార్చిచ్చును తలపిస్తూ, సోషల్ మీడియాలో చెలరేగిపోయింది. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదలైన తర్వాత ఏ స్థాయి వ్యూస్ దక్కుతాయో ఊహించుకోవచ్చు. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ గీతాన్ని అంతే అద్భుతంగా మంగ్లీ పాడటం విశేషం.