సక్సెస్ కోసం పరిగెత్తిన రోజులు.. బాక్సాఫీసు నంబర్ల కోసం ఆందోళన పడిన రాత్రులు.. ఇవన్నీ ఒక క్షణంలో తలకిందులయ్యాయి అంటున్నారు సమంత. విజయం, ఖ్యాతి, డబ్బు అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితం అసంపూర్ణం. మయోసైటిస్ వ్యాధితో పోరాడిన తర్వాత ఆమె జీవితం, ఆలోచనలు, ప్రాధాన్యతలు అన్నీ మారిపోయాయి. గతంలో విజయాలు అనుకున్నప్పటికీ, ఇప్పుడు జీవితాన్ని చూసే దృక్పథం మారిపోయిందని ఆమె వెల్లడించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత, తన అనుభవాలను పంచుకున్నారు.
Also Read: Drishyam 3: ‘ మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ అభిమానులకు.. గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు జీతూ
“గతంలో విజయం అన్నది వరుస సినిమాలు చేయడమే అనుకునేదాన్ని. ఒక ఏడాదిలో ఐదు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలూ ఉన్నాయి. అదే నిజమైన సక్సెస్ అని నమ్మేదాన్ని. వరుసగా సినిమాలు చేయాలి, పెద్ద బ్లాక్‌బస్టర్‌ల్లో నటించాలి, టాప్ 10 హీరోయిన్ల జాబితాలో ఉండాలి – ఇవే నా కలలు. కానీ మయోసైటిస్ తర్వాత నా ఆలోచనలే మారిపోయాయి. రెండేళ్లుగా నా సినిమాలు రిలీజ్ కాలేదు, టాప్ 10 లిస్ట్‌లో నేను లేను. నా దగ్గర వెయ్యి కోట్ల సినిమాలు కూడా లేవు. అయినా నేను ఉన్నంతలో సంతోషంగా ఉన్నాను” అని సమంత అన్నారు. అలాగే..
తనలో వచ్చిన మార్పుల గురించి కూడా ఆమె ఓపెన్ అయ్యారు. “పూర్వం ప్రతి శుక్రవారం బాక్సాఫీసు నంబర్లు చూసి టెన్షన్ పడేదాన్ని. నా స్థానాన్ని ఎవ్వరైన భర్తీ చేస్తారేమో అనే భయం ఉండేది. నా ఆత్మగౌరవం మొత్తం ఆ నంబర్ల మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు అలా లేదు. నా అభిమానుల్లో చాలామంది నన్ను సినిమాల వల్ల, గ్లామర్ వల్ల ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. కానీ వారికోసం నేను ఇప్పుడు హెల్త్ పాడ్‌కాస్ట్‌లు చేస్తున్నాను. ఆరోగ్యంపై వారికి అవసరమైన సమాచారం సులభంగా అందించాలని అనిపించింది” అని చెప్పారు. ప్రస్తుతం సమంత, రాజ్–డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘రక్త్ బ్రహ్మాండ: ది బ్లడీ కింగ్‌డమ్’ లో నటిస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.