సమంత మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం రెడీ అవుతోంది. ఈ మేరకు బ్యాంకాక్ వెళ్ళి శిక్షణ తీసుకోనుంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో అక్షయ్ కుమార్ తో కలసి సందడి చేసింది. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ లో నెగెటీవ్ రోల్ తో అందరినీ ఆకట్టుకుంది సమంత. సమంతను ‘ఫ్యామిలీ మ్యాన్2’ లో ఎల్.టి.టి.ఇ టెర్రరిస్ట్ గా తీర్చిదిద్దిన రాజ్ డికె మరోసారి పూర్తి స్థాయి యాక్షన్ పాత్ర చేయించబోతున్నారు. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండటం విశేషం. ఈ పాత్ర పోషణ కోసమే సమంత మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకోబోతోందట.

సమంత, వరుణ్ కలసి శిక్షణ కోసం బ్యాంకాక్ బాట పట్టనున్నారు. అక్కడ వీరికి హాలీవుడ్ స్టంట్ డైరక్టర్ యాన్నిక్ బెన్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు. యాన్నిక్ బెన్ ఇంతకు ముందు ‘ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సీరీస్ తో పాటు ‘యశోద’ సినిమాలో సమంతతో కొన్ని ఫైట్ సీక్వెన్స్ చేయించాడు. తన వద్ద అయితే అన్ని మెళుకువలు నేర్చుకోవచ్చని సమంత భావించిందట. మరి రాబోయే యాక్షన్ వెబ్ సీరీస్ లో సమంత మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ తో ఎలాంటి స్టంట్స్ చేస్తుందో చూడాలి.