యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చూసి నీరుగారి పోయిన ఆయన ఫ్యాన్స్ కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కేజేఎఫ్-2’ చూశాక ఆశలు చిగురించాయి. ‘కేజీఎఫ్-1’తోనే ఆల్ ఇండియా ఆడియెన్స్ మనసు దోచిన ప్రశాంత్ నీల్, రెండో భాగంతో మరింతగా జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మించిన విజయ్ కిరగండూర్, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. అందువల్లే అభిమానుల్లో ఆశలు మళ్ళీ అంబరం వైపు సాగుతున్నాయి.
ఇప్పటికే ‘కేజేఎఫ్-2’ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ సాగుతోంది. ఒరిజినల్ కన్నడ సీమలో కన్నా మిన్నగా తెలుగునాట, ఉత్తరాదిన ఈ సినిమా సందడి చేయడం విశేషం. దాంతో ప్రశాంత్ నీల్ పేరు కూడా అదే తీరున ఈ ప్రాంతాల్లో మారుమోగిపోతోంది. ఇక ప్రభాస్ కు కూడా ‘బాహుబలి’ సిరీస్ తో దక్షిణాదిన, ఉత్తరాదిన ఎనలేని క్రేజ్ లభించింది. మరి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న ‘సలార్’కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ఊహించవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకొని నిర్మాత విజయ్ కిరగండూర్ ‘సలార్’కు మరిన్ని హంగులు దిద్ది, మరింత భారీగా రూపొందించడానికి బడ్జెట్ ను కూడా హెచ్చించినట్టు తెలుస్తోంది. తెలుగునాట ఉన్న సెంటిమెంట్ ప్రకారం రాజమౌళి సినిమాతో హిట్టు పట్టేసిన హీరోకు వరుసగా కొన్ని ఫ్లాపులు పలకరించడం పరిపాటే! అదే తీరున ప్రభాస్ కు ‘బాహుబలి’ సిరీస్ తరువాత ‘సాహో, రాధే శ్యామ్’ చిత్రాలు నిరాశ పరిచాయి. అయితే ‘సాహో’ దక్షిణాదిన సందడి చేయలేక పోయినా, ఉత్తరాదిన మంచి వసూళ్ళే చూసింది. ఇక ‘రాధే శ్యామ్’ పరాజయానికి అందులో ప్రభాస్ మాస్ ఇమేజ్ కు తగ్గ ఎలిమెంట్స్ లేకపోవడమే కారణమని ట్రేడ్ పండిట్స్ భావిస్తున్నారు. వీరితో నిర్మాత విజయ్ కిరగండూర్ కూడా ఏకీభవిస్తున్నట్టుంది. అందువల్లే ‘సలార్’కు మరిన్ని మెరుగులు దిద్ది జనం ముందు నిలపాలని విజయ్ భావిస్తున్నట్టు సమాచారం.
వాస్తవానికి ముందుగా అనుకున్న ప్రకారం ‘సలార్’ సినిమా ఈ యేడాది ఏప్రిల్ 14న జనం ముందు నిలవాలి. అయితే ప్యాండమిక్ కారణంగా షూటింగ్ లో జాప్యం అనివార్యమయింది. అయితే అదే తేదీకి నిర్మాత విజయ్ తన ‘కేజీఎఫ్-2’ ను విడుదల చేసి బంపర్ హిట్ పట్టేశారు. ‘సలార్’ను మరింత భారీగా తెరకెక్కించి వచ్చే యేడాది అంటే 2023లో ప్రేక్షకుల ముందు నిలపాలని విజయ్ ఆశిస్తున్నారు. మరి ఈ సారి ఏ తేదీన సినిమాను విడుదల చేస్తారో!?