AHA: ఆహా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోంది. ప్రతి వీకెండ్ లోనూ ప్రత్యేక అతిథుల రాకతో ఈ కార్యక్రమం మరింత రంజుగా మారుతోంది. తాజా వచ్చిన ‘దసరా’ మూవీతో గ్రాండ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న నాని ఈ వీకెండ్ తెలుగు ఇండియన్ ఐడిల్ లోని టాప్ టెన్ కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేశాడు. అలానే గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి. చరణ్ సైతం ఇందులో పాల్గొన్నాడు. బాలుకు నివాళిగా ఎస్పీబీ మ్యూజికల్ సెలబ్రేషన్స్ ను జరిపారు. బాల సుబ్రహ్మణ్యం పాడిన పాటలను జంటగా కంటెస్టెంట్స్ పాడి అలరించడం ఒక విశేషమైతే… బాలుతో ప్రత్యక్షంగా తమకు ఉన్న అనుబంధాన్ని వారు తెలియచేయడం మరో విశేషం. బిఎస్ఎఫ్ జవాన్ చక్రపాణి తాను సరిహద్దుల్లో ఉన్న సమయంలో మెసేజ్ రూపంలో బాలు మరణవార్త తనకు చేరిందని, ఆ సమయంలో చాలా మధన పడ్డానని చెప్పి, ఆహుతులందరి హృదయాలు బరువయ్యేలా చేశాడు.
కార్తికేయ, ప్రణతి జంటగా పాడిన పాటకు ఫిదా అయిన ఎస్పీ చరణ్ కార్తికేయకు ఫ్లూట్ ను ప్రెజెంట్ చేయడం విశేషం. అలా సౌజన్య, శ్రుతి; ఆదిత్య, సాయి వైష్ణవి; చక్రపాణి, లాస్యప్రియ; జయరాం, సాకేత్ జోడీలుగా బాలుగారి పాటలు పాడారు. రెండో రోజు నాని రాకతో ‘దసరా’ మూవీ సక్సెస్ హంగామా అంతా తెలుగు ఇండియన్ ఐడల్ లోనే కనిపించింది. ఇక ఇప్పటికే ఈ షో నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా…. తాజాగా విజయవాడకు చెందిన సాయి వైష్ణవి పోటీ నుండి తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఎలిమినేషన్ లోని టాప్ త్రీ కంటెస్టెంట్స్ లో ఆదిత్య ఈసారి కూడా ఉన్నాడు. అలానే లాస్యప్రియ జడ్జిలా మార్కుల సరిగా పడక పోవడంతో ఎలిమినేషన్స్ జాబితాలో చేరింది. లక్కీగా వీరిద్దరికీ ఆడియెన్స్ ఓట్లు బాగా రావడంతో ముందుకు వెళ్ళిపోయారు. పలు హాలీవుడ్ చిత్రాలకు తనదైన గొంతుతో డబ్బింగ్ చెప్పి, తెలుగువారిని అలరిస్తున్న మాటల రాణి… సాయి వైష్ణవి ఈసారి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే… సాయి వైష్ణవికి తెలుగు ఇండియన్ ఐడల్ లైఫ్ టైమ్ మెమరీస్ ను అందించిందనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణకు ఈ వేదికపై సాయి వైష్ణవి డబ్బింగ్ చెప్పడం అనేది నిజంగా గ్రేట్ థింగ్!