దర్శక ధీరుడు రాజమౌళి అన్నంత పని చేశాడు. మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను దద్దరింప చేశాడు. 70 ఎం.ఎం. తెర మీద ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ చూసి మురిసిపోవాలనుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల దాహార్తిని తీర్చాడు. ఇంతవరకూ భీమ్, రామ్ పాత్రలను పూర్తి స్థాయిలో జనాలకు చెప్పకుండా దోబూచులాడిన రాజమౌళి ఇప్పుడీ 3.07 నిమిషాల ట్రైలర్ లో ఆ క్యారెక్టర్స్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. చిన్ననాటి నుండి స్నేహితులైన భీమ్, రామ్ మార్గాలు… పెద్దయ్యాక వేర్వేరుగా అయిపోతాయి. అడవి బిడ్డలైన గోండ్ల కాపరిగా భీమ్ పెరిగితే, ఆంగ్లేయ పాలకులను కాపాడే పోలీస్ అధికారిగా రామ్ ఎదుగుతాడు. గోండ్ల బిడ్డను బ్రిటీషర్స్ ఎత్తుకెళితే, వారి కాపరిగా భీమ్ చేసే గాండ్రింపుకు పులి సైతం బెదిరిపోతుంది. అలాంటి పులిని పట్టించే వేటగాడిగా బ్రిటీషన్స్ తరఫున రామ్ రంగంలోకి దిగుతాడు. అయితే… అటుపక్క ఉన్నది తన సోపతి అని తెలిసి ఆశ్చర్యపోతాడు. చేసిన తప్పును దిద్దుకుంటూ భీమ్ తో రామ్ చేతులు కలిపి, బ్రిటీషర్స్ ఆగడాలను అరికట్టడమే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది.
Read Also : యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి… “ఆర్ఆర్ఆర్” ట్రైలర్
మొదటిలో భీమ్ – రామ్ స్నేహం గురించి చూపిన రాజమౌళి ఆ తర్వాత ఇద్దరిలో ఒకరిని కొమరం భీమ్ గా, మరొకరిని అల్లూరి సీతారామరాజు పాత్రలో చూపించాడు. అక్కడ నుండే అసలు కథ మొదలవుతుంది. చరిత్రలో ఎప్పుడు కలుసుకోని రెండు పాత్రలను ‘ట్రిపుల్ ఆర్’ కోసం రాజమౌళి వెండితెరపై కలపడం ఒక ఎత్తు అయితే, వారికి ఓ దిశా నిర్దేశం చేసే వ్యక్తిగా, విప్లవకారుడిగా అజయ్ దేవ్ గన్ నటించడం మరొక ఎత్తు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించిన ‘ట్రిపుల్ ఆర్’ ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 7న వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది. మొన్నటి వరకూ థియేటర్లలో ‘ట్రిపుల్ ఆర్’ గ్లిమ్స్ చూస్తూ జనం గోలగోల చేశారు. ఇక ఇవాళ్టి నుండీ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ తో పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. చిత్రం ఏమంటే… ఉదయం నుండి పలు నగరాల్లో, పట్టణాల్లో ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ ప్రదర్శించే థియేటర్లలో జనం బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. ఓ సినిమా విడుదల సమయంలో ఎలాంటి హడావుడీ థియేటర్లో కనిపిస్తోందో అదే పండగ వాతావరణం ఈ ట్రైలర్ ప్రదర్శన సమయంలోనూ కనిపించింది. ‘అఖండ’తో మొదలైన కలెక్షన్ల వర్షం… ‘ట్రిపుల్ ఆర్’తో సునామీగా మారడం ఖాయమని ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్…. ఇక కౌంట్ డౌన్ మొదలు పెట్టడమే మిగిలి ఉంది.