Bollywood Couple: బాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. షకీలా సినిమాతో హిందీతో పాటు తెలుగులోనూ రచ్చ చేసిన రిచా చద్దా.. మీర్జాపూర్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అలీ ఫజల్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. తొమ్మిదేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు అక్టోబర్ లో ఒకటి కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కరోనా సమయంలోనే ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం విదితమే. ఇక వీరి పెళ్లి అక్టోబర్ 4 న జరగనుంది. వీరి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒక చిన్న అగ్గిపెట్టె లాంటి కార్డుపైన ఈ జంట సైకిల్ తొక్కుతున్న ఫోటోను ప్రచురించి కింద వెడ్డింగ్ డేట్ ను తెలిపారు.
ఇక వీరి వివాహ వేదిక.. ఢిల్లీలోని జింఖానా క్లబ్ అని తెలుస్తోంది. ఈ పెళ్ళికి బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ రానున్నారట. సెప్టెంబర్ 30 నుంచి ప్రీ వెడ్డింగ్ పనులు మొదలు కానున్నాయని తెలుస్తోంది. ఇక పెళ్లి తర్వాత రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక 2015 నుంచి డేటింగ్ లో ఉన్న అలీ ఫజల్, రిచా చద్దాలు 2017లో అధికారికంగా ప్రకటించారు. కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్న ఈ జంట ఎట్టకేలకు ఈ ఏడాది ఒకటి కానున్నారు. అలీ.. మీర్జాపూర్ సిరీస్ లో గుడ్డుగా అలరించాడు. రిచా.. షకీలా బయోపిక్ లో షకీలాగా నటించి మెప్పించింది. ఇక ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి వీరి వివాహానికి ఏఏ తారలు దిగిరానున్నారో చూడాలి.