చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయంతో ఆకట్టుకుంటుంది. తెలుగువారిని తనదైన అభినయంతో అలరించిన రేవతి ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలతో పరవశింప చేస్తున్నారు.
రేవతి అసలు పేరు ఆశా కేలున్ని. మళయాళ సీమ కొచ్చినలో 1966 జూలై 8న జన్మించారామె. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనతికాలంలోనే మాతృభాష మళయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించేసి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు రేవతి.
రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘మానసవీణ’ చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టారు రేవతి. అదే సమయంలో బాపు తెరకెక్కించిన ‘సీతమ్మ పెళ్ళి’ కూడా రేవతికి మంచి పేరు సంపాదించింది. మణిరత్నం ‘మౌనరాగం’తో రేవతికి మరింత మంచి పేరు లభించింది. తెలుగులో అనువాదమైన ఈ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు రేవతి. అప్పటి నుంచీ తమిళంలో రేవతి నటించిన పలు చిత్రాలు తెలుగువారినీ అనువాదరూపంలో పలకరించాయి. ఏయన్నార్ ‘రావుగారిల్లు’లో నటించిన రేవతి తెలుగువారికి మరింత దగ్గరయ్యారు. వెంకటేశ్ తో కలసి ఆమె నటించిన ‘ప్రేమ’ నటిగా మరిన్ని మార్కులు సంపాదించి పెట్టింది. ‘అంకురం’ చిత్రంలో రేవతి నటనకు ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది. రామ్ గోపాల్ వర్మ ‘గాయం’లోనూ రేవతి తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’లో నటించాక దాదాపు ఎనిమిదేళ్ళు తెలుగు చిత్రాల్లో కనిపించలేదు రేవతి. అయితే మధ్యలో ఆమె నటించిన అనువాద చిత్రాలు మాత్రం బాగానే జనాన్ని ఆకట్టుకొనేవి.
నవతరం కథానాయకుల చిత్రాల్లో తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తున్నారు రేవతి. “అనుక్షణం, లోఫర్, సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, యుద్ధం శరణం, ఇట్లు అమ్మ, మేజర్” వంటి చిత్రాలలో కనిపించి అలరించారు రేవతి.కేవలం నటిగానే కాదు, దర్శకురాలిగానూ రేవతి తనదైన బాణీ పలికించారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘మిత్ర్, మై ఫ్రెండ్’ ఇంగ్లిష్ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ ఇన్ ఇంగ్లిష్ కేటగిరీలో నేషనల్ అవార్డు లభించింది. ఇందులో శోభన ప్రధాన పాత్ర పోషించారు. సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి, అభిషేక్ బచ్చన్ తో ‘ఫిర్ మిలేంగే’ హిందీ చిత్రాన్ని రూపొందించారు రేవతి. ఈ సినిమా ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. ‘ముంబై కటింగ్’ అనే హిందీ చిత్రం కూడా రేవతి దర్శకత్వంలోనే రూపొందింది. ‘కేరళ కేఫ్’ అనే మళయాళ సినిమాకు కూడా రేవతి దర్శకత్వం వహించారు. అయితే ఇవేవీ ‘మిత్ర్, మై ఫ్రెండ్’ లాగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని తమిళ, మళయాళ చిత్రాలకు రేవతి వాయిస్ ఓవర్ కూడా వినిపించారు. ‘తిరుప్పావై’ అనే వీడియో ఆల్బమ్ లో నటించడమే కాదు, గాయనిగానూ తన గొంతు సవరించుకున్నారు రేవతి. మళ్ళీ ఏ తెలుగు చిత్రంలో రేవతి కనిపిస్తారో చూద్దాం!