(జనవరి 28న బి.విఠలాచార్య జయంతి)
తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో జానపద చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. వాటిలో జానపద బ్రహ్మ బి. విఠలాచార్య. తెరకెక్కించిన చిత్రాలు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి. కన్నడ నాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి తెలుగువారిని విశేషంగా అలరించే చిత్రాలు రూపొందించారు విఠలాచార్య. చిత్రవిచిత్రమైన చిత్రాలు రూపొందించి ఆకట్టుకున్న విఠలాచార్య జీవితంలోకి తొంగి చూస్తే, అదీ అలాగే అనిపిస్తుంది. ఉడిపి తాలూకాలోని ఉడయవరలో జన్మించిన విఠలాచార్య చదివింది కేవలం మూడవ తరగతి. చిన్నతనం నుంచీ నాటకాలంటే ఇష్టంతో తొమ్మిదో ఏట ఇంట్లోంచి పారిపోయి, పలు పాట్లు పడ్డారు. చివరకు ఉడిపి బ్రాహ్మణ హోటల్ ను నిర్వహించసాగారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. మిత్రులతో కలసి సినిమా కంపెనీ పెట్టి మైసూరు కేంద్రంగా కన్నడ చిత్రాలు నిర్మించారు. తెలుగులోనూ సినిమాలు తీయాలని మదరాసు చేరారు విఠలాచార్య. తెలుగులో ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం ‘వద్దంటే పెళ్ళి`. ఆపై మరికొన్ని సినిమాలు రూపొందించినా అంతగా అలరించలేకపోయాయి. “శ్రీకనకదుర్గ పూజా మహిమ, వరలక్ష్మీ వ్రతం” వంటి చిత్రాలలో భక్తిరసం కురిపించారు. ఆయనకు విశేషమైన గుర్తింపు తెచ్చిన చిత్రం యన్టీఆర్ తో తొలిసారి తెరకెక్కించిన ‘బందిపోటు’ . ఈ సినిమా తరువాత జానపదాల్లో విఠలాచార్య మార్కు కనిపించసాగింది.
‘బందిపోటు’ ఘనవిజయంతో యన్టీఆర్-విఠలాచార్య కాంబినేషన్ కు క్రేజ్ ఏర్పడింది. వరుసగా యన్టీఆర్ తో విఠలాచార్య తెరకెక్కించిన చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించసాగాయి. “అగ్గి-పిడుగు, మంగమ్మ శపథం, అగ్గి బరాటా, పిడుగురాముడు, చిక్కడు-దొరకడు, గండికోట రహస్యం, కదలడు-వదలడు, ఆలీబాబా 40 దొంగలు, లక్ష్మీ కటాక్షం, విజయం మనదే, రాజకోట రహస్యం, పల్లెటూరి చిన్నోడు” చిత్రాలు యన్టీఆర్- విఠలాచార్య కాంబోలో వెలుగు చూశాయి. వీటిలో ‘పల్లెటూరి చిన్నోడు’ హిందీ చిత్రం ‘గోపి’ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా మినహాయిస్తే, అన్ని చిత్రాలూ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. రిపీట్ రన్స్ లోనూ యన్టీఆర్ తో విఠలాచార్య రూపొందించిన జానపదాలన్నీ వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ చిత్రాలలో యన్టీఆర్ తో విఠలాచార్య వేయించిన మారువేషాలు కూడా జనాన్ని భలేగా మురిపించాయి. యన్టీఆర్ సినిమాలతోనే విఠలాచార్య జనం మదిలో ‘జానపద బ్రహ్మ’గా నిలిచారని చెప్పవచ్చు.
యన్టీఆర్ తరువాత కాంతారావుతోనూ చిత్రాలు రూపొందించి విజయాలు సాధించారు విఠలాచార్య. కాంతారావును ‘కత్తి కాంతారావు’గా నిలిపింది విఠలాచార్య చిత్రాలే! కాంతారావుతో విఠలాచార్య రూపొందించిన “గురువును మించిన శిష్యుడు, జ్వాలాద్వీప రహస్యం, ఇద్దరు మొనగాళ్ళు, అగ్గిదొర, భలే మొనగాడు” వంటి చిత్రాలు అలరించాయి. ‘ఇద్దరు మొనగాళ్ళు’ లో కృష్ణ కూడా ఓ హీరోగా నటించారు. ఈ సినిమా కృష్ణకు కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది. కృష్ణ కెరీర్ లో విఠలాచార్య దర్శకత్వంలో నటించిన ఏకైక చిత్రం ఇద్దరు మొనగాళ్ళు
.
విఠలాచార్య అంటే జానపదాలే. అయితే మారేకాలంతో పాటు తానూ మారాలని సాంఘికాలను రూపొందించారు విఠలాచార్య. ఏయన్నార్ తో ‘బీదలపాట్లు’ తీయగా పరాజయం పాలయింది. తనకు అచ్చివచ్చిన యన్టీఆర్ తోనూ ‘పల్లెటూరి చిన్నోడు’ తీస్తే ఆకట్టుకోలేక పోయింది. రామకృష్ణ, జయసుధతో ‘కోటలోపాగ’ జానపదం తీసినా, అంతగా అలరించలేదు.
పరాజయాలు పలకరిస్తూ ఉండడంతో విఠలాచార్య మళ్ళీ తనను తాను నిరూపించుకోవాలని తపించారు. ఆ సమయంలో ఆయన రంగుల్లో తెరకెక్కించిన ‘జగన్మోహిని’ చిత్రం అనూహ్య విజయం సాధించింది. జయమాలినితో రూపొందించిన ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ సినిమా తరువాత వరుసగా జయమాలినితో “గందర్వకన్య, నవమోహిని, మదనమంజరి” వంటి చిత్రాలు రూపొందించారు విఠలాచార్య. ‘వీర బేతాళ’ అనే త్రీడీ కూడా తెరకెక్కించారు. మోహన్ బాబుతో ‘వీరప్రతాప్’ రూపొందించారు. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలతో సాగారు ఆచార్య. అయితే ఆయన చివరి సూపర్ హిట్ ‘జగన్మోహిని’ అనే చెప్పాలి. తనయుడు బి.వి.శ్రీనివాస్ ను కూడా దర్శకునిగా నిలపాలని తపించారు. యన్టీఆర్ హీరోగా అతని దర్శకత్వంలో “నిన్నే పెళ్ళాడతా, అగ్గివీరుడు” నిర్మించారు. అయితే, అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. విఠలాచార్య చివరి చిత్రంగా ‘కరుణించిన కనకదుర్గ’ వెలుగు చూసింది. ఏది ఏమైనా తెలుగులో విఠలాచార్య తన జానపదాలతో ఎంతగానో మురిపించారు. జానపద బ్రహ్మగా జనం మదిలో నిలిచారు.