(ఆగస్టు 31న ఆరుద్ర జయంతి)
తెలుగు సాహితీవనంలోనూ, తెలుగు సినిమారంగంలోనూ ఆరుద్ర ముద్ర చెరిగిపోనిది. చిత్రసీమలో ఆరుద్ర పాటలు, మాటలు జనాన్ని ఎంతగానో మురిపించాయి. ఇక సాహితీరంగంలో ఆరుద్ర పరిశోధనలు ఎన్నెన్నో తెలియని అంశాలను వెలుగులోకి తెచ్చాయి. అందుకే తెలుగువారికి సదాస్మరణీయులు ఆరుద్ర. తెలుగు సాహితీవనంలో నవకవనాలు విరబూస్తున్న రోజుల్లో శ్రీశ్రీ ఈ యుగం నాది అన్నారు. ఆయన స్థాయిలోనే ఆరుద్ర సైతం తన బాణీ పలికించారు. ఆ నాటి కవితాప్రియులను శ్రీశ్రీ తరువాత అంతగా ఆకట్టుకున్నది ఆరుద్ర అనే చెప్పాలి. కవిగా, రచయితగా, కథకునిగా, పరిశోధకునిగా, నాటక కర్తగా, విమర్శకునిగా ఆరుద్ర సాగిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు. ‘అభ్యుదయ రచయితల సంఘం’ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఆరుద్ర కవితాప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. తాను సంపాదకునిగా పనిచేసిన ‘ఆనందవాణి’ వారపత్రికలో శ్రీశ్రీ కవితలు ప్రచురించారు. అవి అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక ఆరుద్ర రాసిన “త్వమేవాహం, సినీవాలి” సాహితీప్రియులను ఎంతగానో మురిపించాయి.
ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. 1925 ఆగస్టు 31న జన్మించారు. పండిత వంశంలో పుట్టడం వల్ల బాల్యం నుంచీ సాహిత్యంపై మంచి పట్టు చిక్కింది. మాతృభాష తెలుగుతో పాటు అనేక భాషల్లోనూ పాండిత్యం సంపాదించారు. ఆయన గొప్పతనం తెలిసిన చిత్రసీమలోని ప్రముఖులు ఆరుద్రను సినిమా రంగానికి ఆహ్వానించారు. చిత్తూరు నాగయ్య నటించిన ‘బీదలపాట్లు’ చిత్రంలో తొలిసారి ఆరుద్ర కలం పాట పలికించింది. అందులో ఆయన రాసిన “ఓ చిలుకరాజా నీ పెళ్ళెపుడయ్యా…” పాట అప్పట్లో భలేగా అలరించింది. ఆరుద్ర గురించి తెలిసిన ప్రఖ్యాత హిందీ నటులు రాజ్ కపూర్ సైతం తన ‘ఆహ్’ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తూ, ఆయననే రచయితగా ఎంచుకున్నారు. రాజ్ కపూర్ ‘ప్రేమలేఖలు’ తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. అందులో ఆరుద్ర పలికించిన పాటలన్నీ జనాన్ని మురిపించాయి. “పందిట్లో పెళ్ళవుతున్నాదీ… కనువిందవుతున్నాదీ…” పాట విశేషాదరణ చూరగొంది. చిత్రసీమలో ప్రవేశించకముందే కవిగా ఎంతో మంచి పేరున్న ఆరుద్ర సినిమా పాటలు రాయడం ఆయన అభిమానులకు నచ్చలేదు. కొందరు బాహాటంగానే విమర్శించారు. అన్నిటినీ ఆయన చిరునవ్వుతో ఎదుర్కొన్నారు.
తెలుగు సినిమా పాటకు ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చిన వారిలో ఆరుద్ర పేరు ముందు వరుసలో ఉంటుంది. అభ్యుదయ భావాలు ఉన్నా, తన దరికి చేరిన పురాణ నేపథ్యమున్న పాటలు పలికించడంలో శ్రీశ్రీ, ఆరుద్ర ఇద్దరూ తమకు తామే సాటి అనిపించారు. ఒకటా రెండా వందలాది పాటలు ఆరుద్ర కలం నుండి జాలువారి జనాన్ని పులకింప చేశాయి. “అందాల రాముడు… ఇందీవర శ్యాముడు…”, “శ్రీరామ నామాలు శతకోటి… ఒక్కొక్క పేరు బహుతీపి…”, “రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా…”, “మానవుడే మహనీయుడు…”, “ఇదేనండి ఇదేనండి భాగ్యనగరమూ…” “ఊహలు గుసగుసలాడే…”, “ఒకసారి కలలోకి రావయ్యా…”, “వేదంలా ఘోషించే గోదావరి…” వంటి పాటల్లో ఆరుద్ర బాణీ ఇట్టే కనిపిస్తుంది. ఆయన సినిమా పాటలు, రచనలు అన్నీ ఒక ఎత్తు, ఎంతగానో పరిశోధించి రాసిన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఓ ఎత్తు అని అభిమానులు అంటారు. 1998 జూన్ 4న ఆరుద్ర కన్నుమూశారు. ఆరుద్ర ముద్ర మాత్రం తెలుగు సాహితీవనంలో చెరిగిపోకుండా నిలచే ఉంది.