విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరాముడు మహాభినిష్క్రమణ చేసి అప్పుడే 26 ఏళ్ళయింది. అయినా ఆయనను మరచినవారు లేరు. అన్నగా జనం గుండెల్లో నిలిచారు.
తెలుగు చిత్రపరిశ్రమకు ‘పెద్దాయన’గా నిలచిన నటరత్న యన్టీఆర్ నా అనుకున్నవారిని ఆదుకున్న తీరును ఈ నాటికీ సినీజనం తలచుకుంటూ ఉన్నారు. అలా ఆయన అభిమానంతో వెలుగులు విరజిమ్మిన వారెందరో. తెరపై అనేక మార్లు శ్రీకృష్ణ పరమాత్మగా నటించి అలరించారు రామారావు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకొనే కన్నయ్యగా నటించడమే కాదు, నిజజీవితంలోనూ యన్టీఆర్ అదే తీరున సాగడం విశేషం.
యన్టీఆర్ ఓ సారి నమ్మితే వారి కోసం ప్రాణమిస్తారని ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య తరచూ చెప్పేవారు. యన్టీఆర్ విజయవాడలో చదువుకొనే రోజుల్లో ఇద్దరూ కలసి నాటకాలు వేశారు. తాను సినిమా రంగంలో అడుగుపెట్టగానే, తన తమ్ముడు త్రివిక్రమరావును, పుండరీకాక్షయ్యను మదరాసు పిలిపించుకొని వారిద్దరినీ భాగస్వాములుగా చేసి ఎన్.ఏ.టి. సంస్థపై చిత్రాలను నిర్మించారు… ఆ తరువాత పుండరీకాక్షయ్యను సోలో ప్రొడ్యూసర్ గానూ చేశారు. రామారావుతో పుండరీకాక్షయ్య ‘శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, ఆరాధన” వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు…
తాను నటించిన ఎన్నో చిత్రాల్లో విలన్ గా, కమెడియన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా నటించిన నాగభూషణం కూడా యన్టీఆర్ తో సినిమా తీస్తానని కాల్ షీట్స్ అడిగారు… అప్పటికే నాగభూషణం బిజీ ఆర్టిస్ట్… అంతటి బిజీ ఆర్టిస్ట్ కు నిర్మాణ బాధ్యతలు కష్టమవుతాయని భావించిన యన్టీఆర్, తన డేట్స్ కోరిన మరో ఇద్దరు నిర్మాతలు సిహెచ్. రాఘవరావు, కె.బసవయ్యతో కలిపి నాగభూషణంను నిర్మాతగా నిలిపి, నష్టాలు రాకుండా మరీ జాగ్రత్తలు తీసుకున్నారు… అదే “ఒకే కుటుంబం” చిత్రం.
అలాగే తనతో ఎన్నో చిత్రాల్లో నటించిన సత్యనారాయణకూ ‘గజదొంగ’కు కాల్ షీట్స్ ఇచ్చారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు.
ఇక యన్టీఆర్ తో ‘సంసారం, దాసి’ చిత్రాల్లో నాయికగా నటించిన లక్ష్మీరాజ్యం అడగ్గానే ‘నర్తనశాల’లో అర్జున, బృహన్నల పాత్రల్లో అభినయించి అలరించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? తరువాతి రోజుల్లో ఆమె నిర్మించిన ‘మగాడు’లోనూ యన్టీఆర్ నటించారు.
అలాగే తనతో పలు చిత్రాల్లో నటించిన భానుమతి సొంత చిత్రాల్లో నటించారు రామారావు. యన్టీఆర్ ‘తాతమ్మకల’లో నటించినందుకు భానుమతి కోరగానే ఆమెకు కాల్ సీట్స్ ఇచ్చారు. యన్టీఆర్ వంటి సూపర్ స్టార్ కాల్ షీట్స్ ఇచ్చినా ‘అమ్మాయి పెళ్ళి’ అనే సాధారణ చిత్రం తీశారు భానుమతి.
తన ‘పల్లెటూరు’తోనే నాయికగా పరిచయమైన సావిత్రి దర్శకత్వం వహించిన ‘మాతృదేవత’లో నటించి, ఆమెను డైరెక్టర్ గా ప్రోత్సహించారు. సావిత్రి దర్శకత్వంలో రూపొందిన మూడు చిత్రాల్లో సక్సెస్ సాధించిన ఏకైక సినిమా ‘మాతృదేవత’ కావడం గమనార్హం!
యన్టీఆర్ కు టెక్నీషియన్స్ అన్నా ఎంతో గౌరవం. తన మేకప్ మేన్ పీతాంబరంను నిర్మాతగా నిలిపేందుకు “అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్” చిత్రాల్లో నటించి ఆదుకున్నారు. అదే పీతాంబరం నిర్మించిన ‘సాహసమే జీవితం’తోనే తన నటవారసుడు బాలకృష్ణను సోలో హీరోగానూ పరిచయం చేశారు… ఇలా పీతాంబరం ను యన్టీఆర్ ఆదుకున్న వైనాన్ని పీతాంబరం తనయుడు ప్రముఖ దర్శకుడు పి.వాసు ఎన్నో మార్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే కళాదర్శకుడు రాజేంద్రకుమార్ ను కూడా ‘మనుషులంతా ఒక్కటే’తో నిర్మాతను చేశారు. యన్టీఆర్ తో దాసరి నారాయణరావు తీసిన తొలి చిత్రం ఇదే… ఈ సినిమా ఘనవిజయం సాధించింది… ఆ తరువాత రాజేంద్రకుమార్ కు ‘మహాపురుషుడు’ సినిమా కూడా చేసిపెట్టారు రామారావు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.వెంకటరత్నం ఓ సందర్భంలో యన్టీఆర్ కు ఓ సాయం చేశారు. దాంతో ఆయన అడగ్గానే కాల్ షీ్ట్స్ ఇచ్చారు రామారావు. అలా రూపొందిన చిత్రమే ‘యమగోల’. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. మళ్లీ వెంకటరత్నానికి కాల్ షీట్స్ ఇవ్వగా, అదే సమయంలో దేవీవరప్రసాద్ కు కూడా డేట్స్ ఇచ్చిఉండడంతో వారిద్దరినీ భాగస్వాములుగా చేసి నటించారు. అదే ‘నాదేశం’ చిత్రం. ఈ సినిమా యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసిన సమయంలో విడుదలై విజయదుందుభి మోగించింది…
యన్టీఆర్ కు ‘ఫస్ట్ సెంటిమెంట్స్’ కూడా ఎక్కువే .ఆ విధంగానూ ఆయన పలువురికి సినిమాల ద్వారానే సాయం చేశారు. ఆ విషయాలను గుర్తుచేసుకున్నా ఒళ్ళు పులకరిస్తుంది.
యన్టీఆర్ హీరోగా నటించిన ‘చంద్రహారం’ చిత్రం ద్వారానే కమలాకర కామేశ్వరరావు దర్శకుడయ్యారు. విజయా సంస్థ భారీగా నిర్మించిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ తరువాత యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘పెంకిపెళ్ళాం’ చిత్రానికి కూడా కామేశ్వరరావే డైరెక్టర్. అదీ పరాజయం పాలయింది. రెండు ఫ్లాపుల ఇచ్చినా, తన డైరెక్టర్ కు తమ సొంత చిత్రం ‘పాండురంగ మహాత్యం’కు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చారు యన్టీఆర్… అది పెద్ద హిట్. ఆ తరువాత యన్టీఆర్-కె.కామేశ్వరరావు కాంబినేషన్ లో ఎన్నో మహత్తర పౌరాణిక చిత్రాలు వెలుగు చూశాయి.
యన్టీఆర్ ‘అమ్మలక్కలు’ చిత్రం ద్వారానే డి.యోగానంద్ డైరెక్టర్ అయ్యారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తన సొంత చిత్రాలయిన తోడుదొంగలు, జయసింహకు యోగానంద్ కు అవకాశాలు కల్పించారు యన్టీఆర్. ‘జయసింహ’ పెద్ద హిట్. ఆ పైన వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి… ముఖ్యంగా యన్టీఆర్ సొంత చిత్రాలకు యోగానంద్ దర్శకత్వం వహించి మెప్పించారు. వాటిలో అనేకం జనాన్ని విశేషంగా అలరించాయి.
యన్టీఆర్ ‘పల్లెటూరు’ చిత్రంతోనే తాతినేని ప్రకాశరావు డైరెక్టర్ అయ్యారు… ఆపై అనేక చిత్రాలలో వారు కలసి పనిచేశారు… దాంతో ప్రకాశరావు సొంత చిత్రం ‘సంసారం’లో నటించారు యన్టీఆర్… ప్రకాశరావు తనయుడు టి.ఎల్.వి.ప్రసాద్ డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నిర్మించిన ‘ఛాలెంజ్ రాముడు’లోనూ యన్టీఆర్ టైటిల్ రోల్ పోషించారు… తాను ముఖ్యమంత్రి అయిన తరువాత తాతినేని ప్రకాశరావును ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించారు రామారావు.
యన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘షావుకారు’- అందులో కామెడీ రోల్ లో నటించిన పద్మనాభం ఆ తరువాత యన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆ అభిమానంతోనే పద్మనాభం తాను రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్ కంపెనీ పెడుతున్నానని చెప్పగానే కాల్ షీట్స్ ఇచ్చారు రామారావు. అలా యన్టీఆర్ తో ‘దేవత’ చిత్రం తీసి ఆ తరువాత మంచి నిర్మాతగా పేరు సంపాదించారు పద్మనాభం.
యన్టీఆర్ ను తొలిసారి శ్రీరాముని పాత్రలో చూపించిన చిత్రం ‘చరణదాసి’… అందులో ఓ సీక్వెన్స్ లో యన్టీఆర్ శ్రీరామునిగానూ, అంజలీదేవి సీతగానూ కనిపిస్తారు… ఆ చిత్ర నిర్మాత ఎ.శంకర్ రెడ్డి ఆ తరువాత యన్టీఆర్, అంజలీదేవితోనే ‘లవకుశ’ నిర్మించారు… ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా యన్టీఆర్ తన నిర్మాతకు అండగా నిలిచారు… ‘లవకుశ’ ఆల్ టైమ్ హిట్ గా నిలచింది. ఆ తర్వాత శంకర్ రెడ్డి కష్టాల్లో ఉంటే కాల్ షీట్స్ ఇవ్వగా యన్టీఆర్ తో ‘సతీ సావిత్రి’ తీశారు.యన్టీఆర్ కు గురుభక్తి కూడా మెండు… అలాగే తన కథానాయికలు అన్నా ఆయనకు ఎంతో గౌరవం… అలా కూడా కొందరికి చేతనైన సాయం చేసి వారిపై తన అభిమానం చాటుకున్నారు రామారావు.
యన్టీఆర్ తో పలు ప్రయోగాలు చేసిన దర్శకనిర్మాత బి.ఏ.సుబ్బారావు. “పల్లెటూరి పిల్ల”తో యన్టీఆర్ ను జానపద హీరోగా చేశారు. “రాజు-పేద, భీష్మ, రాణీరత్నప్రభ” వంటి చిత్రాలలో యన్టీఆర్ తో ప్రయోగాలు చేస్తూ నిర్మించి దర్శకత్వం వహించారు బి.ఏ.సుబ్బారావు. ఆయన కష్టకాలంలో యన్టీఆర్ తాను హీరోగా నటించిన “భలేతమ్ముడు, రైతుబిడ్డ, సతీసావిత్రి, మావారి మంచితనం”వంటి చిత్రాలకు అవకాశాలు కల్పించారు.
తనతో ‘మల్లీశ్వరి’ వంటి కళాఖండం తీసిన బి.ఎన్.రెడ్డి కోరగానే ఆయన నిర్మించిన ‘బంగారుపంజరం’కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.. అలాగే ‘పాతాళభైరవి’తో తనకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టిన మరోగురువు కేవీ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు సొంత చిత్రం ‘శ్రీకృష్ణసత్య’ కు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చి ఆదుకున్నారు.
తన నిర్మాతలు నష్టపోయిన సందర్భాల్లోనూ వారికి మళ్ళీ డేట్స్ ఇచ్చి ఆదుకొనేవారు యన్టీఆర్… తనతో నిండుమనసులు చేసిన ఎస్.డి.లాల్ నిర్మాతగా మారితే ‘నేనే మొనగాణ్ణి’ చేసిపెట్టారు యన్టీఆర్… అది అట్టర్ ఫ్లాప్ కాగా, ఆ తరువాత నుంచీ ఆయనకు రీమేక్ సినిమాలు ‘నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, మగాడు, నేరం నాది కాదు ఆకలిది, లాయర్ విశ్వనాథ్, రాజపుత్ర రహస్యం’ వంటివి ఇప్పించి ఆదుకున్నారు.
తన పాత నిర్మాతలు కష్టాల్లోఉంటే వారికి డేట్స్ ఇవ్వడం, ఆ డేట్స్ కోరినవారి నుండి పాత నిర్మాతలకు గుడ్ విల్ ఇప్పించి ఆదుకోవడం కూడా యన్టీఆర్ పలుమార్లు చేశారు. అలా తనతో ‘పరమానందయ్య శిష్యుల కథ’తీసిన తోట సుబ్బారావును, ‘మహామంత్రి తిమ్మరుసు’ నిర్మించిన ఎన్.రామబ్రహ్మంను ఆదుకున్నారు. వారిద్దరి డేట్స్ రోజామూవీస్ సంస్థకు ఇప్పించి, ఆ సంస్థ నిర్మాతల ద్వారా తన పాత నిర్మాతలకు గుడ్ విల్ ఇచ్చేలా చేసి ఆదుకున్నారు రామారావు.
ఇలా చెప్పుకుంటూ పోతే యన్టీఆర్ తన సినిమాల ద్వారా, తన వారికి చేసిన సాయం గురించి ఈ నాటికీ చిత్రసీమలో చెప్పుకుంటూనే ఉన్నారు. అందుకే యన్టీఆర్ తనువు చాలించి ఇరవై ఆరేళ్ళయినా, ఇంకా తెలుగువారి హృదయాల్లో కొలువై ఉన్నారు.