స్టార్ హీరోయిన్ సమంత నాయికగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వంద రోజులలో దాదాపుగా పూర్తి చేశారు. సోమవారం నాటికి ఈ మూవీ పాట మినహా పూర్తయ్యింది. మరో వైపు గ్రాఫిక్స్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలనూ ప్రారంభించబోతున్నారు. నిజానికి ఈ సినిమాను ఆగస్ట్ 12వ తేదీ విడుదల చేయాలని నిర్మాత భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
‘యశోద’ కొత్త విడుదల తేదీ గురించి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ”భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మా ‘యశోద’ను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని అనుకున్నాం. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేయబోతున్నాం. వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ పనులు ఈ నెల ద్వితీయార్థంలో మొదలు కాబోతున్నాయి. కాబట్టి ‘యశోద’ పూర్తిగా సిద్ధమాయ్యాకే మంచి తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం. అలాగే రానున్న రోజుల్లో చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ విడుదల, ఇతర వివరాలు తెలియజేస్తాం. సమంత ‘యశోద’ పాత్రని సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎంతో ఏకాగ్రతతో, పూర్తి అంకితభావంతో యాక్షన్, ఇతర సన్నివేశాలు అద్భుతంగా చేశారావిడ. సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాం” అని అన్నారు.
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ప్రధాన త్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చుతుండగా, పులగం చిన్నారాయణ, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి మాటలను, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి పాటలను అందిస్తున్నారు. ఈ చిత్రానికి హేమాంబర్ జాస్తి క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.